War 2 | జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కలయికలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వార్ 2’ విడుదలకు ఇంకో ఆరు రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది. వార్ 2 చిత్రం తారక్ నటిస్తున్న తొలి హిందీ చిత్రం కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఈ మూవీపై భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. అయితే సినిమా రిలీజ్ దాదాపు దగ్గరపడినప్పటికీ, ఒక్క పెద్ద ప్రమోషనల్ ఈవెంట్ కూడా జరగకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ లోటు భర్తీ చేయబోతున్నారు మేకర్స్.
తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, ఆగస్టు 10న హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదికగా ‘వార్ 2’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.“ది మ్యాన్ ఆఫ్ మాసెస్ (NTR), ది గ్రీక్ గాడ్ (Hrithik), ఒక ఎపిక్ నైట్ కోసం మీ క్యాలెండర్లో డేట్‌ని మార్క్ చేసి పెట్టుకోండి అని ఉత్సాహంగా ప్రకటించారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ ప్రమోషనల్ ఈవెంట్ విజయవాడలో జరగనుందన్న వార్తలు గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినా, చిత్రబృందం వాటిని ఖండించింది. చివరకు హైదరాబాద్‌లోనే ఈ గ్రాండ్ ఈవెంట్ జరపాలని భావించి అఫీషియల్ ప్రకటన విడుదల చేసింది.
యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం, స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందగా, ఈ చిత్రం ‘వార్’ మూవీకి సీక్వెల్‌గా వస్తుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. తారక్, హృతిక్ రోషన్ కలిసి నటించడం, యాక్షన్ ఎపిసోడ్స్‌లో వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ సినిమాపై బజ్‌ను పెంచింది. ఆగస్టు 14న ‘వార్ 2’తో పాటుగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన ‘కూలీ’ మూవీ కూడా విడుదల అవుతోంది. ఈ భారీ మల్టీ స్టారర్లో రజనీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ తదితరులు నటిస్తున్నారు. ఈ ఇండిపెండెన్స్ వీక్కి బాక్సాఫీస్ పైచేయి ఎవరు సాధిస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.