Mission: Impossible | హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ తన భారతీయ అభిమానుల కోసం ప్రత్యేక సందేశం పంపారు. “మై ఆప్ సబ్ సే బహుత్ ప్యార్ కర్తా హూఁ” (నేను మిమ్మల్ని అందరినీ చాలా ప్రేమిస్తున్నాను) అంటూ హిందీలో తన ప్రేమను వ్యక్తం చేశారు. అంతేకాకుండా, పాటలు, నృత్యాలతో నిండిన బాలీవుడ్ తరహా సినిమాలో నటించాలని ఉందని ఆయన ఆకాంక్షించారు. క్రూజ్ నటించిన తాజా చిత్రం “మిషన్: ఇంపాజిబుల్ – ది ఫైనల్ రికనింగ్” ఈ శనివారం దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. క్రిస్టోఫర్ మెక్‌క్వారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, విజయవంతమైన “మిషన్: ఇంపాజిబుల్” సిరీస్‌లో ఎనిమిదవ భాగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పారామౌంట్ పిక్చర్స్ ఇండియా విడుదల చేసిన ప్రత్యేక ప్రమోషనల్ వీడియోలో, 62 ఏళ్ల టామ్ క్రూజ్ నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన అవనీత్ కౌర్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా అవనీత్, భారతదేశంలోని తన అభిమానుల కోసం కొన్ని మాటలు చెప్పమని క్రూజ్‌ను కోరారు.దీనికి స్పందిస్తూ క్రూజ్ హిందీలో, “మై ఆప్ సబ్ సే బహుత్ ప్యార్ కర్తా హూ (నేను మిమ్మల్ని అందరినీ చాలా ప్రేమిస్తున్నాను) అని అన్నారు.
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ అతిథి పాత్రలో కనిపించిన “మిషన్: ఇంపాజిబుల్ – ఘోస్ట్ ప్రోటోకాల్” సినిమా ప్రమోషన్ కోసం 2011లో తాను భారతదేశాన్ని సందర్శించిన మధురమైన జ్ఞాపకాలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.
“నాకు భారతదేశంపై చాలా ప్రేమ ఉంది. భారతదేశం ఒక అద్భుతమైన దేశం, ఇక్కడి ప్రజలు, సంస్కృతి అద్భుతం. నా అనుభవం మొత్తం నా మనసులో చెరగని ముద్ర వేసింది. ప్రతి క్షణం నాకు గుర్తుంది. నేను ఇక్కడ దిగినప్పటి నుండి, తాజ్ మహల్‌ను సందర్శించడం, ముంబైలో గడిపిన సమయం.. ప్రతి క్షణం నా జ్ఞాపకాల్లో స్పష్టంగా నిలిచిపోయింది,” అని క్రూజ్ అన్నారు.
తాను బాలీవుడ్ సినిమాలకు పెద్ద అభిమానినని, అందుకే భారతదేశంలో ఒక సినిమా చేయాలని ఉందని క్రూజ్ తన మనసులోని మాటను వెల్లడించారు. ఒక సన్నివేశంలో ఎవరైనా అకస్మాత్తుగా పాట పాడటం నాకు చాలా ఇష్టం. అది నాకు చాలా నచ్చుతుంది. వివిధ దేశాల సంగీత నాటకాలను చూస్తూ నేను పెరిగాను. నాకు బాలీవుడ్ సినిమాలు అంటే చాలా ఇష్టం. మీరు హఠాత్తుగా ఒక పాట అందుకుంటారు, అది చాలా అందంగా ఉంటుంది. నాకు ఇక్కడి నృత్యాలు, పాటలు, నటులు అంటే చాలా ఇష్టం. పాడటం, నృత్యం చేయడం, నటించడం అనే నటుల యొక్క ప్రత్యేకమైన నైపుణ్యం అది,” అని ఆయన పేర్కొన్నారు.
క్రిస్టోఫర్ మెక్‌క్వారీ దర్శకత్వం వహించిన “మిషన్: ఇంపాజిబుల్ ది ఫైనల్ రికనింగ్” చిత్రంలో హేలీ అట్వెల్, సైమన్ పెగ్, ఎసాయ్ మొరేల్స్, ఏంజెలా బాసెట్, వింగ్ రామ్స్, హెన్రీ చెర్నీ మరియు పామ్ క్లెమెంటీఫ్ వంటి ప్రముఖ తారాగణం కూడా ఉన్నారు. క్రూజ్ సహ-నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం భారతదేశంలో ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో విడుదలైంది.