స్టార్ హీరో చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘వాల్తేరు వీరయ్య’. శృతి హాసన్ నాయికగా నటిస్తున్నది. హీరో రవితేజ కీరోల్ చేస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి చిరంజీవి, రవితేజ కలిసి డాన్స్ చేసిన ‘పూనకాలు లోడింగ్..’ పాటను హైదరాబాద్ సంధ్య థియేటర్లో అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. దర్శకుడు బాబీ మాట్లాడుతూ…‘ఇద్దరు స్టార్లను ఈ పాటలో చూపించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. పాటలోనే కాదు మొత్తం సినిమా పూనకాలు లోడింగ్ అనేలా ఉంటుంది. సినిమా మొత్తం ఒక జాతర లాంటి అనుభూతినిస్తుంది’ అన్నారు. ‘ఈ పాటకు అభిమానులు ఫైవ్‌స్టార్ రేటింగ్ ఇస్తారు. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుంది. మీరు సినిమా రిలీజ్ రోజున ఇంతకంటే ఎక్కువ ఆనందపడతారు’ అని నిర్మాత వై. రవిశంకర్ అన్నారు.