అమరావతి : సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని తనకు తల్లిదండ్రుల పుణ్యం, వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ఆయన చూపిన దారిలో విజయవంతంగా నడుస్తున్నానని ప్రముఖ సినీ నటుడు సుమన్ (Suman) అన్నారు. సోమవారం తిరుమల ( Tirumala ) శ్రీవారిని వీఐపీ ప్రారంభ విరామ గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. గతంలో ఏం జరిగిందన్నది మరిచిపోయి అందరూ ఆరోగ్యంగా ఉండాలని , అందరికీ మేలు జరిగే కార్యక్రమాలు జరుగాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు. ప్రస్తుతం తాను ఇతర భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నానని పేర్కొన్నారు.
తెలుగు, కన్నడ, మలయాళం, ఒరియా సినిమాల్లో నటిస్తునట్లు వెల్లడించారు. అన్నమయ్యలో వేంకటేశ్వరస్వామి, శ్రీ రామదాసులో రాముడిగా, సత్యనారాయణస్వామి సినిమాలో దేవుడి పాత్ర చేశానని వివరించారు. తాను కోరుకున్న దాని కంటే ఎక్కువగా దేవుడు తనకు ఇచ్చాడని స్పష్టం చేశారు.