సినీ పరిశ్రమలో ఇరవై ఏండ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు వివేక్ ఒబెరాయ్. రామ్గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘కంపెనీ’ చిత్రంతో తెరంగేట్రం చేశారు వివేక్. ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఇటీవల దక్షిణాది చిత్ర పరిశ్రమకు ప్రతినాయకుడిగా పరిచయం అయ్యారు. తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల్లో విలన్గా నటిస్తున్నారు. తెలుగులో రామ్చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో ప్రతినాయకుడిగా ఆకట్టుకున్నారు వివేక్ ఒబెరాయ్. తన నట ప్రయాణం గురించి ఆయన మాట్లాడుతూ…‘నటుడిగా ఇక్కడ సంతోషాలు, బాధలు చూశాను. వివాదాల్లోకి నన్ను లాగారు.
నటుల జీవితం అభద్రతతో కూడుకున్నది. ‘షూట్ ఔట్ లోఖండ్వాలా’ అనే సినిమా విజయవంతమైనా నాకు 14 నెలల పాటు ఒక్క అవకాశమూ రాలేదు. మేమంతా ఒకే కుటుంబం అని పరిశ్రమలోని వారు చెబుతుంటారు. కానీ కష్టం వస్తే ఒక్కరూ తోడు రారు. అవకాశాలు రానప్పుడు సేవా కార్యక్రమాలు, వ్యాపార మార్గాలు ఎంచుకున్నా.’ అని చెప్పారు.