Vishwambhara | మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర (Vishwambhara). బింబిసార చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న వశిష్ట మల్లిడి ఈ చిత్రానికి దర్శకుడు. పాన్ ఇండియా స్థాయిలో సోషియో ఫాంటసీ, మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిషతో పాటు ఆషిక రంగనాథ్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొదట్లో ఈచిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నామని ప్రకటించారు మేకర్స్.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సంక్రాంతి రేసు నుంచి తప్పుకుందని తెలిసింది. ఈ సినిమా చిత్రీకరణతో పాటు నిర్మాణనంతర పనులు, సినిమాకు అత్యంత కీలకంగా భావించే వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా పెండింగ్‌లో వుందట. అందుకే హడావుడిగా ఈపనులు పూర్తిచేసి సినిమాను విడుదల చేయడం ఇష్టం లేని దర్శకుడు చిత్రాన్ని సంక్రాంతికి వాయిదా వేయాలనే ప్రపోజల్‌ను హీరో చిరంజీవి, నిర్మాత వద్ద వుంచాడు. అయితే మెగాస్టార్ మాత్రం రాత్రి పగలు కష్టపడి వర్క్ పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేసే విధంగా ప్లాన్ చేయమని కోరాడని, సినిమాలకు అత్యంత కీలకంగా భావించే సంక్రాంతి సీజన్‌ను మిస్ కాకుండా చూసుకోవాలని తెలిపారని సమాచారం.
ఒకవేళ విశ్వంభర సంక్రాంతి సీజన్ నుంచి తప్పుకోవాల్సి వస్తే ఆ రోజు గేమ్‌ఛేంజర్ విడుదల ప్లాన్ చేసుకోవాలనే ఆలోచనలో వున్నారు నిర్మాత దిల్ రాజు. ఇక విశ్వంభర సినిమా కోసం మేకర్స్ 13 భారీ సెట్లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి హనుమాన్ భక్తుడిగా కనిపించబోతున్నాడు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి.. పాటలతో పాటు నేపథ్య సంగీతం ప్రత్యేకంగా వుండబోతుందని మేకర్స్ చెబుతున్నారు.