మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ‘విశ్వంభర’. చాలాకాలం తర్వాత చిరంజీవి నటిస్తున్న సోషియోఫాంటసీ చిత్రమిది. దర్శకుడు వశిష్ఠ తొలి సినిమా ‘బింబిసార’ కూడా సోషియో ఫాంటసీ కథాంశమే కావడం విశేషం. ఆ సినిమా విజయమే ఆయన్ను చిరంజీవిని డైరెక్ట్ చేసే స్థాయికి తీసుకెళ్లిందని చెప్పాలి. ఈ సినిమా ద్వారా తెరపై ఓ కొత్తలోకాన్ని ఆవిష్కరించనున్నాడు వశిష్ఠ. ఇదొక భిన్నమైన కథ. ఓ బలమైన కారణంచేత దైవానుగ్రహంతో భూమిపై పుట్టిన కారణజన్ముడి కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నదని ఫిల్మ్ వర్గాల టాక్. ‘విశ్వంభర’ అనేది ఒక లోకం అని తెలుస్తున్నది. ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్ మొదలైంది. ఈ భారీ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నది ‘విశ్వంభర’ టీమ్. జూలై నాటికి చిత్రీకరణ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్‌కి ఎక్కువ సమయం తీసుకోనున్నారు దర్శకుడు వశిష్ఠ. ఈ సినిమా సీజీ, వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం చిత్రబృందం విదేశాలకు కూడా వెళ్లనుందని విశ్వసనీయ సమాచారం. 2025 జనవరి 10న, సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రానికి త్రిష కథానాయిక. మీనాక్షి చౌదరి, సురభి, ఇషా చావ్లా, అశికా రంగనాథ్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు.