Vishwambara | మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. దాదాపు మూడేళ్ల నిరీక్షణ తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నప్పటికీ, విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా ఉండాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నారు.తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని జూలై 10న విడుదల చేయాలని చిత్రబృందం ప్రాథమికంగా నిర్ణయించింది. మొదట ఈ సినిమా సమ్మర్లో విడుదల కావాల్సి ఉన్నా, భారీ సినిమాల పోటీ, సాంకేతిక పనుల్లో జాప్యం కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం జూన్ చివర్లో రావాల్సిన కొన్ని పెద్ద సినిమాలు వాయిదా పడటంతో జూలై రెండో వారం సోలో రిలీజ్‌కు మంచి అవకాశం ఏర్పడింది.
పురాణాల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వంలోని 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు కలిపి మొత్తం 14 లోకాల నేపథ్యం ప్రధానంగా ఉంటుంది. ఈ లోకాలన్నింటినీ కాపాడే బాధ్యతను తీసుకున్న ఒక సాధారణ వ్యక్తి పాత్రలో చిరంజీవి కనిపించనున్నట్లు సమాచారం. అతడు అతీత శక్తులతో ఎలా పోరాడాడు అన్నదే కథలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు.
సినిమా ఎక్కువ భాగం గ్రీన్ మ్యాట్ సెట్స్‌లో చిత్రీకరించబడగా, ప్రతి లోకానికి ప్రత్యేకమైన విజువల్ స్టైల్ ఇవ్వడానికి వీఎఫ్ఎక్స్ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తిగా నాణ్యతతో సిద్ధమైతేనే విడుదల చేయాలని దర్శకుడు వశిష్ట భావిస్తున్నారు. మొత్తానికి, తెలుగులో చాలా కాలం తర్వాత రాబోతున్న ఈ భారీ సోషియో-ఫాంటసీ చిత్రం చిరంజీవి కెరీర్లో మరో ప్రత్యేక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ పనులు సమయానికి పూర్తయితే జూలై 10న బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ తన విశ్వరూపాన్ని చూపడం ఖాయం. లేదంటే సినిమా మరో కొత్త తేదీకి వెళ్లే అవకాశం ఉంది.