‘నా గత చిత్రాలు కొన్ని పూర్తి స్థాయిలో మెప్పించలేపోయాయి. అందుకే అందరి ఫీడ్బ్యాక్ తీసుకున్నా. ఈ సినిమాతో మళ్లీ ఒకటి నుంచి మొదలుపెడుతున్నా’ అన్నారు హీరో విశ్వక్సేన్. ఆయన తాజా చిత్రం ‘ఫంకీ’ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది. అనుదీప్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. కయాదు లోహర్ కథానాయికగా నటించింది. భీమ్స్ సిసిరోలియో స్వరకర్త. శనివారం ఈ సినిమా నుంచి ‘రట్టాటటావ్..’ అనే గీతాన్ని విడుదల చేశారు.
దేవ్ పవార్ సాహిత్యం అందించిన ఈ పాటను రామ్ మిరియాల ఆలపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విశ్వక్సేన్ మాట్లాడారు. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, అనుదీప్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని, ఆయనతో సినిమా చేశాక జీవితాన్ని చూసే కోణం మారిపోయిందన్నారు.
కుటుంబమంతా కలిసి చూసే సినిమా ఇదని, ఆద్యంతం నవ్వుల్ని పంచుతుందని దర్శకుడు అనుదీప్ కేవీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. నరేష్, వీటీవీ గణేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణం: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, దర్శకత్వం: అనుదీప్ కేవీ.