Stunt Master | యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో తమిళ పాపులర్ స్టంట్ మాస్టర్ మోహన్‌రాజ్ అలియాస్ ఎస్.ఎం.రాజు (52) దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ‘వెట్టువమ్’ చిత్రానికి సంబంధించిన యాక్షన్ ఘట్టాలను ఎస్.ఎం.రాజు సారథ్యంలో తెరకెక్కిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశంలో భాగంగా కారు టాప్లింగ్ (బోల్తా కొట్టే) స్టంట్‌ను తెరకెక్కిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. అత్యంత ప్రమాదకరమైన ఈ స్టంట్ నిర్వహణ సమయంలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ, ఘోర ప్రమాదం జరిగింది.
ఈ ఘటనపై సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న నటుడు విశాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజు నాకు గత 20 ఏళ్లుగా తెలుసు. అతని మరణం నన్ను ఎంతగానో కలచివేసింది, అంటూ భావోద్వేగంగా స్పందించారు. “రాజుకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. అతని కుటుంబానికి మేము సహాయంగా ఉండాలి. ఏం చేయాలో ఆలోచిస్తున్నాం,” అని తెలిపారు.అయితే విశాల్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదకర స్టంట్‌ను స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ చేయవద్దని స్పష్టంగా హెచ్చరించారు. “ఇది సాధారణమైన స్టంట్ కాదు. కానన్ బ్లాస్ట్ సాయంతో తానే పూర్తి చేస్తానని దిలీప్ చెప్పినా, రాజు మాత్రం ఆ స్టంట్‌ను తానే స్వయంగా చేస్తానని పట్టుబట్టాడు, అని విశాల్ వెల్లడించారు.
అతను స్టంట్ పూర్తి చేసిన వెంటనే శరీరంపై గాయాలేమీ కనిపించకపోయినా, అతనిలో ఎలాంటి చలనం లేకపోవడం గమనించారట. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అతను చనిపోయినట్టు ప్రకటించారు. నాగపట్నం జిల్లాలో తమిళ చిత్రం ‘వెట్టువం’ షూటింగ్ సమయంలో జరిగిన ఈ తీవ్ర విషాద సంఘటన తమిళ సినీ పరిశ్రమను షాక్‌కు గురి చేసింది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దుర్ఘటన తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలో స్టంట్ కళాకారుల భద్రతపై మరోసారి చర్చలు మొదలయ్యాయి. అత్యంత ప్రమాదకరమైన స్టంట్లు చిత్రీకరించే ముందు గట్టి భద్రతా నిబంధనలను అమలు చేయాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మరల గుర్తు చేస్తోంది.