Vishal | కోలీవుడ్ హీరో విశాల్ తన కెరీర్లో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నారు. ఆయన తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా దగ్గరయ్యాడు. అయితే ఇప్పుడు ఆయన కెరీర్లో కీలక మలుపు తీసుకున్నారు. రవి అరసు దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న తన కొత్త చిత్రం ‘మకుటం’ కి తానే దర్శకత్వం వహిస్తున్నట్టు దీపావళి సందర్భంగా విశాల్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఇటీవల హీరో–డైరెక్టర్ మధ్య సృజనాత్మక విభేదాలు తలెత్తినట్లు టాక్ వినిపించింది. ఆ వార్తలను విశాల్ తన తాజా సోషల్ మీడియా పోస్ట్‌తో నిజం చేశారు.
విశాల్ తన పోస్ట్‌లో..“అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపాల పండుగ అందరికీ ఆనందం, శ్రేయస్సు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంలో ‘మకుటం’ సెకండ్ లుక్‌ను మీతో పంచుకుంటున్నాను. అదే సమయంలో ఈ చిత్రంతో నేను దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన క్షణం.ఇది నేను ఎప్పుడూ ఊహించలేదు. కానీ పరిస్థితులు నన్ను ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి. ఎవరూ నన్ను బలవంతం చేయలేదు. నిర్మాతల శ్రమ, ప్రేక్షకుల నమ్మకాన్ని కాపాడటం నా బాధ్యత. ‘మకుటం’ను ప్రేక్షకులు ఆస్వాదించేలా, ప్రొడ్యూసర్స్ ఎఫర్ట్స్‌కు రక్షణగా నిలవడానికి నేను దర్శకత్వం చేపట్టాను అని అన్నారు.
తన పోస్ట్‌లో విశాల్ మరింత భావోద్వేగంగా స్పందిస్తూ, కొన్నిసార్లు సరైన నిర్ణయం తీసుకోవడం అంటే బాధ్యత తీసుకోవడమే. అన్ని విషయాలను సరిచేసి, పెద్ద చిత్రాన్ని విజయవంతం చేయడం నా లక్ష్యం. ఈ దీపావళి నాకు కొత్త వెలుగును తెచ్చింది. ఇది ఇక రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. ఇది నా కొత్త ప్రారంభం అని పేర్కొన్నారు. విశాల్ గతంలో కూడా డైరెక్టర్ మిస్కిన్‌తో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ‘డిటెక్టివ్ 2’ చిత్రాన్ని తానే డైరెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలోనే “డైరెక్షన్ చేయాలన్న నా 25 ఏళ్ల కల నిజమవుతోంది” అన్నారు. కానీ ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ‘మకుటం’తో ఆ కల నిజమవుతోంది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ యాక్షన్, థ్రిల్లర్ జానర్లో రూపుదిద్దుకుంటోంది. ఫస్ట్ లుక్‌తోనే విశాల్ పవర్ఫుల్ అవతార్‌లో కనిపించగా, సెకండ్ లుక్‌కి విశాల్ డైరెక్టర్‌గా ఉండటం అదనపు హైలైట్‌గా మారింది.