Virosh | స్టార్ కపుల్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి తర్వాత తెగ వార్తలలో నిలుస్తున్నారు. ఫిబ్రవరి 26న వారి వివాహం కాగా, మార్చి 26తో తమ పెళ్లి జరిగి ఒక నెల పూర్తి కావడంతో, ఈ జంట తమ స్పెషల్ మూమెంట్స్‌ను గుర్తు చేసుకుంటూ ఇప్పటి వరకు ఎవరూ చూడని అన్‌సీన్ వెడ్డింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలలో ఈ జంట తమ కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులతో కలిసి ఎంతో ఆనందంగా గడిపిన క్షణాలు కనిపించాయి. కొన్ని చిత్రాల్లో ఇద్దరూ పక్కపక్కన నిలబడి చిరునవ్వులతో పోజులివ్వగా, మరికొన్ని ఫొటోలలో ఒకరినొకరు హత్తుకుని ప్రేమను పంచుకుంటూ కనిపించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఫిదా చేస్తున్నాయి.
ఈ సందర్భంగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగభరితమైన పోస్ట్ షేర్ చేసింది. మా పెళ్లై నెల రోజులు అయిపోయాయంటే నమ్మలేకపోతున్నాను. ఒకప్పుడు పెళ్లి అనే ఆలోచనే చాలా దూరంగా అనిపించేది. కానీ ఇప్పుడు ఇది నా జీవితంలో అత్యంత అందమైన నిజంగా మారింది, అంటూ ఆమె తన ఆనందాన్ని పంచుకుంది. తన పెళ్లిని ప్రత్యేకంగా మార్చిన స్నేహితులు ఐశ్వర్య కొల్లా, ప్రియా మాగంటి, అర్పితలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. వాళ్లు లేకపోతే ఈ వేడుక ఇంత అద్భుతంగా ఉండేది కాదు. ఇదే నా చిన్న ప్రపంచం, అంటూ ఎమోషనల్ అయింది.
అదే విధంగా విజయ్ దేవరకొండ కూడా తన పోస్ట్‌లో హార్ట్‌టచింగ్ మెసేజ్ రాశారు. జీవితంలో కొన్ని క్షణాలు చాలా ప్రత్యేకం. అవి ఎప్పుడు వచ్చి పోతాయో తెలియదు. కానీ ఆ క్షణాలను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తే, అవి జీవితాంతం మనతో ఉంటాయి అంటూ ఆయన పేర్కొన్నారు. తమ వెడ్డింగ్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించిన ప్లానర్స్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక వీరి వివాహం విషయానికొస్తే, ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్ సమీపంలోని ఓ లగ్జరీ హోటల్లో అత్యంత సన్నిహితుల మధ్య ఈ జంట పెళ్లి పీటలెక్కింది. అనంతరం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించారు.. దాదాపు ఏడేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట, తమ వెడ్డింగ్‌ను ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’గా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ మళ్లీ కలిసి ‘రణబాలి’ అనే పీరియడ్ డ్రామాలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.