రివ్యూ: ‘విరాటపర్వం’
తారాగణం: రానా, సాయిపల్లవి, ప్రియమణి, నందితాదాస్, నవీన్‌చంద్ర, జరీనావాహెబ్, ఈశ్వరీరావు, సాయిచంద్, బెనర్జీ, రాహుల్ రామకృష్ణ తదితరులు
సినిమాటోగ్రఫీ: డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి
సంగీతం: సురేష్ బొబ్బిలి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సమర్పణ :సురేష్‌బాబు
నిర్మాణ సంస్థలు సురేష్ ప్రొడక్షన్స్, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
రచన-దర్శకత్వం: వేణు ఊడుగుల
తెలంగాణ జనజీవితాన్ని నక్సలైట్ ఉద్యమం ఎంతగానో ప్రభావితం చేసింది. 80, 90 దశకాల్లో ఎంతో మంది యువత నక్సల్స్ భావజాలానికి ఆకర్షితులై అడవి బాట పట్టారు. డాక్టర్లు, ఇంజనీర్స్ వంటి ఉన్నత విద్యావంతులు కూడా నాడు మూవ్మెంట్లో భాగస్వామ్యులయ్యేవారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో నక్సల్స్ సమాంతర వ్యవస్థను నడిపిన ఉదంతాలు కూడా ఉన్నాయి. గతాన్ని పక్కనపెడితే.. నక్సల్స్ ఉద్యమం, నాటి సామాజిక, సాంఘిక పరిస్థితుల గురించి నేటి యువతకు పెద్దగా అవగాహన లేదు. ఈ నేపథ్యంలో 90 దశకం నాటి నక్సలైట్ నేపథ్య కథతో దర్శకుడు వేణు ఊడుగుల విరాటపర్వం చిత్రానికి శ్రీకారం చుట్టడం అందరిలో ఆసక్తిని పెంచింది. యథార్థ సంఘటన ఆధారంగా ప్రేమ, విప్లవాన్ని కలబోసి రాసుకున్న మానవీయ కథాంశమిదని దర్శకుడు వేణు ఊడుగుల పలు సందర్భాల్లో సినిమా గురించి వెల్లడించారు. ప్రేమ అనే భూమిక మీద నడిచే విప్లవ నేపథ్య ఇతివృత్తం కావడం కూడా విరాటపర్వంపై అంచనాలు పెరగడానికి కారణమైంది. దాదాపు మూడేళ్ల క్రితం మొదలుపెట్టిన ఈ సినిమా అనేక అవాంతరాల్ని దాటుకొని ప్రేక్షకుల ముందుకొచ్చింది. రివల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ అంటూ ప్రేమకథను నక్సలైట్ ఉద్యమ నేపథ్యంలో చూపించే ఈ సరికొత్త ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతమైంది? చిత్ర బృందం మూడేళ్ల శ్రమకు ఎలాంటి ఫలితం దక్కింది? ఈ విషయయాలన్నీ తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
కథ గురించి:
వెన్నెల (సాయిపల్లవి) అందమైన పల్లెటూరి అమ్మాయి. నాటి వరంగల్ జిల్లా ములుగు దగ్గరలోని ఓ గ్రామం ఆమెది. నాన్నఒగ్గు కథా కళాకారుడు కావడంతో చిన్నతనం నుంచే కవిత్వం , సాహిత్యంపై మక్కువ పెంచుకుంటుంది. నక్సలైట్ నాయకుడు రవన్న (రానా) అరణ్య పేరుతో రాస్తున్న రచనలు చదివి అతని ప్రేమలో పడుతుంది. ఎలాగైనా అరణ్యను కలుసుకోవాలని కలలు కంటుంది. ఓ రోజు అరణ్యను అన్వేషిస్తూ ఇళ్లు వదిలి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో వెన్నెల ప్రయాణం ఎలా సాగింది? నాటి సంక్షుభిత సామాజిక, రాజకీయ పరిస్థితుల నడుమ ఆమె ఎలాంటి కష్టనష్టాల్ని ఎదుర్కొంది? కృష్ణుడిపై మీరాబాయిలా అరణ్యపై అవ్యాజమైన అనురాగాన్ని పెంచుకున్న వెన్నెల పయనం చివరకు ఏ మజిలీకి చేరుకుంది? ప్రేమ, విప్లవం మధ్య తలెత్తిన నైతిక సంఘర్షణ అరణ్య, వెన్నెల కథను తీరానికి చేర్చిందన్నది తెరపై చూడాల్సిందే..
కథా విశ్లేషణ:
పోలీసుల కోవర్టుగా ముద్రవేయబడి..నక్సలైట్లచే హత్య చేయబడ్డ తూము సరళ అనే మహిళ యథార్థ గాథ ఆధారంగా దర్శకుడు వేణు ఊడుగుల ఈ కథ రాసుకున్నారు. నాడు ఆ ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ వాస్తవ సంఘటనను తీసుకొని.. దానికి తనదైన తాత్విక, కవితాత్మక భావాల్ని మేళవించి ఈ కథను చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు వేణు ఊడుగుల. సాధారణంగా నక్సలైట్ ఇతివృత్తాలు సామాజిక సమస్య ప్రధానంగానో.. పోరాటాల కేంద్రంగానే నడుస్తుంటాయి. కానీ ఈ సినిమాను నక్సలైట్ నేపథ్యంలో నడిచే ఓ ప్రేమకథగా తీర్చిదిద్దడం ప్రత్యేకంగా అనిపిస్తుంది. కృష్ణుడిపై మీరాబాయి పెంచుకున్న ఆరాధనా భావంలాగా తన ప్రేమ కూడా స్వచ్ఛమైనదని వెన్నెల నమ్ముతుంటుంది. జీవితాంతం అరణ్యతో కలిసి ప్రయాణం చేయాలన్నది వెన్నెల లక్ష్యం. ప్రేమ కోసం వెన్నెల సంఘర్షణ ప్రధానంగా కథను నడిపించాడు దర్శకుడు. ఈ క్రమంలో నాటి రాజకీయ, సామాజిక పరిస్థితుల్ని కూడా అత్యంత సహజంగా చిత్రించాడు. ప్రథమార్థంలో అరణ్యను వెతుక్కుంటూ వెన్నెల చేసే ప్రయాణం భావోద్వేగాల్ని పంచుతుంది. జిల్లాలు మారుతూ అరణ్య కోసం అన్వేషించడం.. ఈ క్రమంలో వెన్నెల పోలీసుల నుంచి ఎదుర్కొనే వేధింపులు నాటి పరిస్థితులకు అద్దం పట్టాయి. అప్పటి రోజుల్లోని అణచివేత, పోలీసులు చేసే దుర్మార్గాల్ని కళ్లకుకట్టినట్లు చూపించారు. ప్రథమార్థమంతా ఎక్కడా సాగతీత లేకుండా వడివడిగా సాగిపోయింది.
ఇక ద్వితీయార్థంలో అరణ్య, వెన్నెల తాలూకు సంఘర్షణపై ఎక్కువగా దృష్టిపెట్టారు. విప్లవోద్యమంలో ప్రేమకు తావు లేదని అరణ్య ఎంత వారిస్తున్నా..తన జీవితప్రయాణం అరణ్యతోనే ముడిపడి ఉందని వెన్నెల నిర్ణయం తీసుకోవడం..ఈ క్రమంలో వారిద్దరి మధ్య సంఘర్షణ ఆకట్టుకుంటుంది. అప్పటి పోలీసుల బూటకపు ఎన్కౌంటర్లు, దళాల్లోకి కోవర్టులను పంపి వారిని తుదముట్టించే ప్రయత్నాలతో ద్వితీయార్థంలో కథను ఆసక్తిగా నడిపించారు. ఇక క్లైమాక్స్ ఘట్టాలు తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తాయి. దర్శకుడు వేణు ఊడుగుల తనదైన భావుకత కలబోసి పతాక ఘట్టాల్ని మనసుకు హత్తుకునేలా తీర్చిదిద్దాడు. ఎక్కడా నాటకీయతకు చోటులేకుండా ప్రతి సన్నివేశాన్ని సహజంగా, వాస్తవికతను ప్రతిబింబిస్తూ చిత్రీకరించారు. 1990 దశకం నాటి తెలంగాణ పరిస్థితులకు దర్పణం పడుతూ ఈ సినిమా సాగింది. విప్లవం నేపథ్యంలో పవిత్రమైన ప్రేమను ఆవిష్కరించడంలో దర్శకుడు వేణు ఊడుగుల సఫలీకృతుడయ్యారు. అయితే ద్వితీయార్థంలో కథాగమనం అక్కడక్కడా మందగించినట్లు కనిపిస్తుంది. వెన్నెల, అరణ్య నేపథ్యంలో మరిన్ని సన్నివేశాలుంటే బాగుండేదనిపిస్తుంది.
నటీనటుల పనితీరు ఎలా ఉందంటే:
ఈ సినిమాకు అంతాతానై నిలిచింది సాయిపల్లవి. వెన్నెల పాత్రలో తనదైన సహజ అభినయంతో ఆకట్టుకుంది. తెలంగాణ యాసలో అద్భుతంగా సంభాషణలు పలికించింది. దర్శకుడు వేణు ఊడుగుల చెప్పినట్లు వెన్నెల పాత్రకు సాయిపల్లవి తప్ప వేరొకరు న్యాయంచేయలేరనిపించింది. ఇక దళ నాయకుడు రవన్నగా రానా చక్కటి నటనతో మెప్పించాడు. కథాపరంగా పాత్ర నిడివి తక్కువగా అనిపించినా.. ప్రభావవంతమైన నటనతో ఆకట్టుకున్నారు. రానా తల్లి పాత్రలో సీనియర్ నటి జరీనా వాహబ్ అద్భుతంగా నటించింది. టీచర్‌గా నందితాదాస్‌కు కథలో చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది. కథానాయిక తల్లిదండ్రులుగా సాయిచంద్, ఈశ్వరీరావు తమదైన అభినయంతో మెప్పించారు. ప్రిమయణి, నవీనచంద్ర తమ పరిధుల మేరకు నటించారు. ఇక సాంకేతికంగా అన్ని విభాగాల్లో చక్కటి నాణ్యత కనిపించింది. సురేష్ బొబ్బిలి పాటలు, నేపథ్య సంగీతం ప్రధానబలంగా నిలిచాయి. దర్శకుడు వేణు ఊడుగుల రాసిన సంభాషణలు హృదయాల్ని తాకాయి. స్వతహాగా మంచి కవి అయిన వేణు ఊడుగుల తనదైన ఫిలాసఫీని డైలాగ్స్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
తీర్పు:
విప్లవం, ప్రేమ కలబోసిన సరికొత్త ప్రణయగాథగా విరాటపర్వం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది.
రేటింగ్: 3/5