‘మాస్ సినిమాలు చేస్తున్నా కానీ..రా అండ్ రస్టిక్‌గా ఉండే సినిమాలు చేసి చాలా రోజులైంది. ఆ లోటుని తీర్చే చిత్రమిది. యాక్షన్‌తో పాటు కదిలించే భావోద్వేగాలుంటాయి’ అని అన్నారు అగ్ర హీరో విక్రమ్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘వీర ధీర శూర’. ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకుడు. ఎస్.జె.సూర్య, సూరజ్, దుషార విజయన్ కీలక పాత్రల్ని పోషించారు. ఈ నెల 27న విడుదలకానుంది. నైజాం ఏరియాలో మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేస్తున్నది.
ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో విక్రమ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో సూర్యతో కలిసి నటించడం మరచిపోలేని అనుభూతినిచ్చిందని, ఆయన ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నానని, సినిమాలో ఓపెనింగ్‌ను ఎవరూ మిస్ కావొద్దని, తొలి సన్నివేశం నుంచే కథ మొదలవుతుందని తెలిపారు. ‘రంగస్థలం’ వంటి రా అండ్ రస్టిక్ సినిమా ఇదని, తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని ఎస్జే సూర్య పేర్కొన్నారు. ‘మహారాజ’ తర్వాత తమ సంస్థ తెలుగులో చేస్తున్న సినిమా ఇదని నిర్మాత ఎన్వీ ప్రసాద్ చెప్పారు.