తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’) సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ రాని కారణంగా వాయిదా పడింది. ఈ విషయంలో చిత్రబృందం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. జనవరి 9న న్యాయస్థానం నుంచి తుది ఉత్తర్వులు రాబోతున్నాయి.
ఈ నేపథ్యంలో సినిమా విడుదలను వాయిదా వేశారు. సెన్సార్ బోర్డ్ సూచనల మేరకు మార్పులు చేసినప్పటికీ.. ధృవీకరణ పత్రం నిరాకరించడంపై తమిళ ఇండస్ట్రీలో నిరసన వ్యక్తమవుతున్నది. సెన్సార్ బోర్డు వైఖరిని నిరసిస్తూ పలువురు సినీ తారలు విజయ్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘జన నాయగన్’ సినిమా విషయంలో సెన్సార్ వారు సూచించిన మార్పుల గురించి తమిళ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.
సెన్సార్ వారు సూచించినట్లుగా దాదాపు 27 కట్స్‌కు నిర్మాతలు అంగీకరించారు. రాజకీయ సంబంధిత 50వరకు డైలాగ్స్‌ను మ్యూట్ చేశారు. ఏంజీఆర్ గురించి చెప్పిన సంభాషణలను కూడా తొలగించినట్లు తెలిసింది. అయితే ఇన్ని మార్పులు చేసినా సినిమాలోని రాజకీయ సంభాషణలపై సెన్సార్ బోర్డ్‌లోని ఓ సభ్యుడు అభ్యంతరం చెప్పినట్లు తెలిసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ విజయ్ చెప్పిన సంభాషణలే సర్టిఫికెట్ నిరాకరణకు ప్రధాన కారణాలయ్యాయని అంటున్నారు.
రాజకీయ ప్రస్తావన ఉన్న డైలాగ్‌లను పూర్తిగా తొలగించాలన్నది సెన్సార్ అభిమతంగా కనిపిస్తున్నదని, ప్రభుత్వ సూచనల మేరకు బోర్డు నడచుకుంటున్నదని తమిళ సినీ రంగంలో విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 9న హైకోర్టు వెలువరించే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయ్ సినిమాలకు సంబంధించిన వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో ‘కావలన్’ ‘తుపాకి’ ‘తలైవా’ ‘కత్తి’ ‘సర్కార్’ వంటి చిత్రాలపై వివాదాలు తలెత్తాయి. విజయ్ రాజకీయ రంగప్రవేశం నేపథ్యంలో ‘జన నాయగన్’ సినిమాను రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసిందని విజయ్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు.