దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘బీస్ట్’. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకుడు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘దర్శకుడు నెల్సన్ ఎంతో కష్టపడి పైకొచ్చాడు. ప్రతి సినిమాకు కొత్త కథాంశాల్ని పరిచయం చేస్తున్నాడు. ‘బీస్ట్’ ట్రైలర్ చూస్తే మరో వినూత్నమైన స్టోరీని మనకు అందించబోతున్నాడని అర్థమవుతున్నది. సంగీత దర్శకుడు అనిరుధ్ ‘అరబిక్ కుతు’ పాటకు ప్రపంచం మొత్తం డ్యాన్స్ చేస్తున్నది. పూజాహెగ్డే కాలు పెడితే చాలు ప్రతి సినిమా హిట్టే. ప్రతి సినిమాకు పరిణతి సాధిస్తూ ఆమె పాన్ఇండియా కథానాయికగా ఎదిగింది. విజయ్ ఒక స్టార్ హీరో అయినప్పటికీ ప్రేక్షకుడిలా ఆలోచించి కథలు ఎంపిక చేసుకుంటాడు.
కొత్త దర్శకుల్ని ప్రోత్సహిస్తుంటాడు. కేవలం రెండు సినిమాలు చేసిన నెల్సన్‌కు ఇంత పెద్ద ప్రాజెక్ట్ అప్పగించడం విజయ్ అభిరుచికి అద్దం పడుతుంది. కమర్షియల్ పంథాలో కొత్త కథల్ని ఎంచుకోవడం ఆయన శైలి. ‘బీస్ట్’ చిత్రం అన్ని భాషల్లో పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ మాట్లాడుతూ ‘నేను దర్శకత్వం వహించిన ‘వరుణ్ డాక్టర్’ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు మంచి ఆదరణ కనబరిచారు. ‘బీస్ట్’ ఆద్యంతం వినోదప్రధానంగా సాగుతుంది. విజయ్ అభిమానులందరిని ఆకట్టుకుంటుంది’ అన్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మాట్లాడుతూ “అరబిక్ కుతు’ పాన్ వరల్డ్ పాటగా మారింది. విజయ్‌తో నేను చేసిన నాలుగో చిత్రమిది.
దిల్‌రాజుగారు మంచి మనసున్న వ్యక్తి. ఓ సందర్భంలో ఆయన చెన్నైలోని నా రికార్డింగ్ థియేటర్‌కు రావడం ఆనందం కలిగించింది. భవిష్యత్తులో మరిన్ని తెలుగు చిత్రాలు చేయాలనుకుంటున్నా’ అన్నారు. పూజాహెగ్డే మాట్లాడుతూ “బీస్ట్’ మాస్ కమర్షియల్ ఫిల్మ్. కథలో అనూహ్యమైన మలుపులు ఉంటాయి. నెల్సన్ డార్క్ హ్యూమర్‌ను బాగా హ్యాండిల్ చేస్తాడు. నేను ఎప్పటి నుంచో అనిరుధ్ అభిమానిని. విజయ్ వంటి ప్రొఫెషనల్ హీరోతో నటించడం మరచిపోలేని అనుభూతినిచ్చింది’ అని చెప్పింది.