కోట్‌పల్లి, జూలై 10 : ‘పల్లె ప్రగతి’తో పల్లెల రూపురేఖలు మారుతున్నాయి. హరితహారంలో భాగంగా గ్రామంలో విరివిగా మొక్కలు నాటడంతో గ్రామాలు పచ్చందాలను సొంతం చేసుకుంటున్నాయి. పల్లెల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నది. ఇందులో భాగంగా మండలంలోని ఇందోల్ గ్రామం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. రూ.38 లక్షలతో గ్రామంలోని ప్రతి వీధిలో సీసీ రోడ్డును నిర్మించారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లాను వేసి నిత్యం తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇంటింటికీ పంచాయతీ ట్రాక్టర్‌తో వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పంచాయతీ సిబ్బంది ప్రతి వీధిని శుభ్రం చేస్తుండడంతో పల్లెంతా పరిశుభ్రంగా మారింది. గ్రామంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనంలో వివిధ రకాల మొక్కలను నాటడంతో ఎంతో ఆహ్లాదకరంగా మారింది. గ్రామస్తులు పల్లె ప్రకృతి వనానికి వెళ్లి సేదతీరుతున్నారు. ప్రతి వీధిలో మురుగునీటి కాల్వలను నిర్మించడంతో పాటు అక్కడక్కడ ఉన్న పెంట కుప్పలను తొలగించారు. పురాతన ఇండ్లనూ కూల్చివేసి శుభ్రం చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. గ్రామంలో రైతులకు ఇబ్బందులు తొలగించేలా పొలాలకు వెళ్లే తొవ్వలకు ఫార్మేషన్ రోడ్లను వేయించారు. ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణంతో పాటు ఇంకుడు గుంతలను నిర్మించారు. రైతులు చర్చించుకునేందుకు రైతు వేదిక నిర్మాణం పూర్తై అందుబాటులోకి వచ్చింది. చివరి మజిలీకి వైకుంఠధామాన్ని నిర్మించారు. డంపింగ్ యార్డు నిర్మాణం పూర్తి కావడంతో పాటు కంపోస్ట్ షెడ్డులో సేంద్రియ ఎరువును సైతం తయారు చేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు ‘పల్లె ప్రగతి’తో సమసి పోయాయి. త్వరితగతిన గ్రామం అభివృద్ధి చెందుతుండడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ సమీపంలో పల్లె ప్రకృతి వనం..
గ్రామపంచాయతీ భవనం వెనుకాలే పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించారు. వివిధ రకాల మొక్కలతో పాటు పూలు మొక్కలు నాటడంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపిస్తున్నది. గ్రామ నర్సరీలో దాదాపుగా 10వేల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి.
స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాం..
నిత్యం చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం. కంపోస్ట్ షెడ్డులో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నాం. పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించాం. గ్రామంలోని పురాతన ఇండ్లు, పెంట కుప్పలను తొలగించాం. గ్రామంలోని కుంటను మినీ ట్యాంకు బండ్‌గా మార్చేందుకు చేపట్టిన పనులు చకచకా సాగుతున్నాయి. పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం.