విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సినీరంగంలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా స్వశక్తితో పైకొచ్చారు. దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్లో కూడా తనదైన ముద్రను వేస్తున్నారు. ఇటీవలే ‘మహారాజ’ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారాయన.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేష్‌బాబు ‘అతడు’ సినిమా తనకెంతో స్ఫూర్తినిచ్చిందని, కష్టాల్లో ఉన్న ప్రతీసారి ఆ సినిమా చూసి ఉత్తేజం పొందుతానని చెప్పారు. ‘కెరీర్ ఆరంభంలో కష్టాల్లో ఉన్నప్పుడు ‘అతడు’ సినిమాను పదేపదే చూసేవాడ్ని.
ఆ సినిమాలో మహేష్‌బాబు పాత్రను తీర్చిదిద్దిన విధానం అద్భుతం. ఆరంభం నుంచి ముగింపు వరకు ప్రతీ సీన్‌ను గుర్తుపెట్టుకున్నా. దర్శకుడు త్రివిక్రమ్ ఎమోషన్స్‌ను గొప్పగా తెరపైకి తీసుకొచ్చాడు. ఆ సినిమాలో కామెడీతో పాటు పాటలు కూడా బాగా ఇష్టం’ అని విజయ్‌సేతుపతి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ‘విడుదల -2’తో పాటు తమిళంలో మరో చిత్రంలో నటిస్తున్నారు.