భారతీయ దిగ్దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో విజయ్‌సేతుపతి, సాయిపల్లవి ప్రధానపాత్రధారులుగా ఓ చిత్రం తెరకెక్కనున్నదనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇన్ని రోజులూ అనధికారికంగా వినిపించిన ఈ వార్త, ఇప్పుడు అధికారికంగా నిజమైంది. ఈ క్రేజీ కలయికలో సినిమా ఉందని మేకర్స్ శుక్రవారం ప్రకటన చేశారు. ఈ సినిమాను మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.
దేశభక్తి, మాఫియా, ప్రేమ… ఇలా నేపథ్యమేదైనా దాన్ని మణిరత్నం తెరకెక్కించే తీరు విభిన్నంగా ఉంటుంది. మరి త్వరలో చిత్రీకరణ ప్రారంభించుకోనున్న ఈ సినిమా ఏ తరహా కథాంశంతో రూపొందనుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఏ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకత్వంలో ఏ.సుభాస్కరన్ సమర్పణలో ఈ చిత్రం రూపొందనున్నది. ఈ సినిమా తాలూకు మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తారు.