Vijay- Rashmika | టాలీవుడ్ క్రేజీ జోడీ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న మళ్లీ స్క్రీన్‌పై కలసి కనిపించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. గతంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ జంట ఇప్పుడు ముచ్చటగా మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇటీవల న్యూయార్క్ ఇండియా డే పరేడ్‌లో ఇద్దరూ కలిసి కనిపించడం, గత కొంతకాలంగా ఈ జంట రిలేషన్షిప్లో ఉందన్న ప్రచారానికి మరింత బలాన్ని ఇచ్చింది. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం, యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాలో ఇద్దరూ నటించబోతున్నారని తెలుస్తోంది.
హడావుడీ లేకుండానే ఈ ప్రాజెక్ట్ మొదలైందని సమాచారం. హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే ప్రారంభమైందట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. కథ వినగానే రష్మిక వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, ఈ సినిమా కథ 1854 – 1878 మధ్య బ్రిటిష్ పాలన నేపథ్యంలో జరిగే ఓ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో రాయలసీమ యాసలో మాట్లాడే ఓ పల్లెటూరి యువకుడిగా కనిపించనున్నాడు. ఇది ఆయన కెరీర్లో ఇప్పటివరకు చేసిన పాత్రలకంటే భిన్నంగా ఉండనుందని సమాచారం. ఈ సినిమాలో ఎమోషన్, యాక్షన్ సన్నివేశాలు ఎంతో బలంగా ఉంటాయని, రాహుల్ సాంకృత్యాన్ అందించిన స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని టాక్. ఆయన ఇప్పటికే ట్యాక్సీవాలా, శ్యామ్ సింగ రాయ్ సినిమాలతో డిఫరెంట్ కాన్సెప్ట్‌లకు మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్‌ను కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారని సమాచారం.
ఈ కాంబోలో వచ్చిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ కాగా, డియర్ కామ్రేడ్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయం దక్కించుకోలేకపోయింది. విజయ్-రష్మిక మధ్య కెమిస్ట్రీకు అప్పట్లో మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు మూడోసారి కలిసి నటించడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.