Vijay | టాలీవుడ్లో పవన్ కళ్యాణ్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో, కోలీవుడ్‌లో విజయ్ కి అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న విజయ్ ప్రస్తుతం జన నాయగన్ అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం విజయ్ చివరి చిత్రం అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు. ఈ క్రమంలో సహనటి మమితా బిజు మాత్రం కొంత మేర క్లారిటీ ఇచ్చింది. జన నాయగన్ సినిమాలో దళపతి విజయ్ సోదరి పాత్రలో మమితా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, షూటింగ్ విరామం సమయంలో విజయ్‌ని తన తదుపరి ప్రాజెక్ట్ గురించి మమిత అడిగిందట. ‘జన నాయగన్’ చిత్రమే మీ చివరి సినిమానా అని విజయ్ను అడిగాను. దానికి ఆయన ‘ఆ విషయం ఇప్పుడే చెప్పలేను. అది 2026 ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది’ అని ఆయన నాతో అన్నారు. ఈ సినిమా షూటింగ్ అయితే ఎంతో సరదాగా గడిచింది. చిత్రీకరణ ఆఖరి రోజు నాతో పాటు అందరం కూడా చాలా ఎమోషనల్ అయ్యాం. విజయ్ సార్ కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు అని మమితా చెప్పుకొచ్చింది.
అందుకే టీమ్‌తో కలిసి ఫొటోలు కూడా దిగలేకపోయామంటూ మమిత పేర్కొంది. ఇక సినిమాలో తన పాత్ర గురించి ఇప్పుడే ఏమీ చెప్పనని, తెరపైనే చూడాలని మమిత తెలిపారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జన నాయగన్’ చిత్రాన్ని పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్ర బృందం. రీసెంట్గా విజయ్ పుట్టినరోజు సందర్భంగా ‘ది ఫస్ట్ రోర్’ అనే వీడియో విడుదల కాగా, దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులో విజయ్ పవర్ఫుల్ పోలీస్ అధికారి లుక్‌లో కనిపించి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారు. విజయ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు.