రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న ఎమోషనల్ లవ్‌స్టోరీ ‘ది గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలు. చిత్ర నిర్మాణం తుదిదశకు చేరుకున్నది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా టీజర్‌ని సోమవారం విడుదల చేశారు. స్టార్హీరో విజయ్ దేవరకొండ టీజర్‌ని లాంచ్ చేసి మాట్లాడుతూ ‘ఈ సినిమాతో నటిగా రష్మిక బాధ్యత మరింత పెరుగుతుందని ఆశిస్తున్నా. టీజర్లో విజువల్స్ బావున్నాయి. మనసుల్ని కదిలించే కథతో సినిమా తీశారని తెలుస్తున్నది. మూవీ చూసేందుకు వెయిట్ చేస్తున్నా.’ అన్నారు.
ఇక టీజర్ విషయానికొస్తే.. ఓ కాలేజ్ హాస్టల్లోకి రష్మిక అడుగుపెడుతున్న సీన్‌తో టీజర్ మొదలైంది. హీరోహీరోయిన్ల బ్యూటిఫుల్ రిలేషన్‌ని టీజర్లో చూపించారు. ‘నయనం నయనం కలిసే తరుణం.. ఎదనం పరుగే పెరిగే వేగం..’ అంటూ విజయ్ దేవరకొండ ఇచ్చిన వాయిస్ఓవర్ ఈ టీజర్లో ప్రత్యేక ఆకర్షణ. ‘రేయి లోలోతుల సితార..’ అనే పాట బీజీఎం.. ‘ఇదేదో పికప్ లైన్ అయితే కాదుగా.. అస్సలు పడను..’ అంటూ రష్మిక చెప్పే డైలాగ్ ఇది వైవిధ్యమైన ప్రేమకథ అని చెప్పకనే చెబుతున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: కృష్ణన్ వసంత్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాణం: గీతాఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటైర్టెన్మెంట్.