విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీకి అచ్చంపేట నియోజకవర్గం తుమ్మెన్‌పేటలో పునాది వేశామని, రానున్న రోజుల్లో దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు కృషి చేస్తామని సినీ దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక ప్రకటించారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం తుమ్మెన్‌పేట సమీపంలోని బీఎంఆర్ ఫంక్షన్ హాల్లో 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి, తొమ్మిదో తరగతి విద్యార్థులకు దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ చెక్కులను విద్యార్థులకు తన తల్లిదండ్రులు మాధవి, గోవర్ధన్రావుతోపాటు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ, డీఈవో రమేశ్‌తో కలిసి విజయ్ దేవరకొండ, రష్మికలు అందజేశారు.
మొత్తం నిజయోజకవర్గంలో ఉన్న 45 ప్రభుత్వ పాఠశాలల్లో 181మంది విద్యార్థులకు ప్రథమ స్థానం సాధించిన వారికి రూ.10వేలు, ద్వితీయస్థానం సాధించిన వారికి రూ.5వేల చొప్పున చెక్కులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే క్రమశిక్షణ, లక్ష్యం, పట్టుదల ఉంటే అనుకున్న గమ్యం చేరవచ్చు అని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు, గురువులు, పెద్దలకు మర్యాద ఇవ్వాలని, విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తే సమాజం అభివృద్ధి చెందుతుందని, అందుకే వారిని ప్రోత్సహించేందుకు దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్‌షప్‌లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చదువులో మరింత రాణించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో రేవతిరెడ్డి, ఎంపీవోతోపాటు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.