Kingdom | విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందించిన కింగ్డమ్ సినిమా మొదటి నుంచి రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ప్రాజెక్ట్‌గానే ప్రచారం అందుకుంది. పీరియడ్ యాక్షన్ డ్రామాగా, అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించిన ఈ చిత్రంపై అభిమానులు, సినీ వర్గాలు, అలాగే నిర్మాణ సంస్థ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే విడుదల తర్వాత వచ్చిన స్పందన మాత్రం ఫ్యాన్స్‌ని చాలా నిరాశపరిచింది. విడుదల రోజునుంచే సినిమా నెగటివ్ టాక్‌ను ఎదుర్కొంది. రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద కింగ్డమ్ కలెక్షన్లు తీవ్రంగా నిరాశపరిచాయి.
తొలి వారాంతానికే కలెక్షన్లు గణనీయంగా పడిపోవడంతో, సినిమా చాలా తక్కువ రోజుల్లోనే థియేటర్ల నుంచి తప్పుకుంది. పెట్టిన భారీ బడ్జెట్ ను దాదాపు తిరిగి పొందలేకపోవడం వల్ల నిర్మాతలు భారీ నష్టాలను చవిచూశారని పరిశ్రమలో వినిపిస్తున్న సమాచారంగా తెలుస్తోంది. ఈ వాణిజ్య పరాజయం ‘కింగ్డమ్ 2’ భవితవ్యంపై నేరుగా ప్రభావం చూపింది. సినిమా విడుదలకు ముందే రెండో భాగం స్క్రిప్ట్, విజువల్ ప్లానింగ్‌తో పాటు కొన్ని ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించినట్టు తెలిసినా, ప్రస్తుతం మాత్రం ఈ సీక్వెల్‌పై పెద్ద అనిశ్చితి నెలకొంది. మొదటి భాగం ఫలితం బాగోలేకపోవడంతో, రెండో భాగంలో మళ్లీ పెట్టుబడులు పెట్టడంపై నిర్మాణ సంస్థ సందేహంలో పడిందని పరిశ్రమలో చర్చ సాగుతోంది. దీనివల్ల సీక్వెల్ పనులు పూర్తిగా నిలిపివేశారని అంతర్గత సమాచారం.
అధికారిక ప్రకటన ఇప్పటి వరకు బయటకు రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం “కింగ్డమ్ సీక్వెల్ రద్దు”, “కింగ్డమ్ 2 వాయిదా” వంటి పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. నెటిజన్లలో కూడా దీనిపై రెండు వర్గాల అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. కొంతమంది అభిమానులు “సీక్వెల్లో కథను ఎలా ముందుకు తీసుకెళ్తారన్న ఆసక్తి ఉంది” అంటుండగా, మరికొందరు “మొదటి భాగం సరైన రీతిలో పనిచేయలేదు… సీక్వెల్ చేయకపోవడమే మంచిది” అంటున్నారు.అయితే అధికారికంగా నిర్మాతల నుంచి లేక దర్శకుడి నుంచి ఏదైనా క్లారిటీ వచ్చే వరకు ఇవన్నీ ఊహాగానాలే.