‘ఈ టీమ్‌లో వారిని నేనెప్పుడూ కలవలేదు. కానీ వారితో ఏదో అనుబంధం ఉందనిపించింది. మౌళి అండ్ టీమ్ మా ఇంటికి వచ్చి మీట్ అయినప్పుడు సక్సెస్మీట్కు రావాలని అడిగారు. నేను కాదనలేకపోయా. వీళ్లంతా ఔట్‌సైడర్స్. ఏ సపోర్ట్ లేకుండా సక్సెస్ అందుకున్న వీళ్లు మరెంతో మంది కొత్తవాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తారు. ఒక్కరి సక్సెస్ ఎంతోమందికి మేలు చేస్తుంది’ అన్నారు అగ్ర హీరో విజయ్ దేవరకొండ. గురువారం జరిగిన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా సాయిమార్తాండ్ దర్శకత్వంలో రూపొందిన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రాన్ని బన్నీ వాసు, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ.. ఈ టీమ్ మరిన్ని సక్సెస్ఫుల్ మూవీస్ చేయాలని ఆకాంక్షించారు. తనకు, అల్లు అరవింద్‌గారికి విజయ్ దేవకొండ అంటే ఎంతో ఇష్టమని, త్వరలో గీతా ఆర్ట్స్‌లో విజయ్‌తో సినిమా చేయబోతున్నామని, అది ఆయన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రమవుతుందని బన్నీ వాసు తెలిపారు. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో విజయ్ దేవరకొండ భాగం కావడం ఆనందంగా ఉందని నిర్మాత వంశీ నందిపాటి పేర్కొన్నారు.