విజయ్ దేవరకొండ కథానాయకుడిగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ నటిస్తున్న 12వ సినిమా ఇది. ‘వీడీ12’గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రం స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కనున్నట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ స్వరాలు అందిస్తున్నారు. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో శ్రీలీలను కథానాయికగా ఖరారు చేశారు. అనివార్య కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలొస్తున్నాయి. తాజా సమాచారం మేరకు శ్రీలీల స్థానంలో బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ త్రిప్తి దిమ్రిని కథానాయికగా ఎంపిక చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలిసింది.
తనను సంప్రదించిన చిత్రబృందానికి ఆమె ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణీ వసంత్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ కథనాలపై చిత్రబృందం నుంచి ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. బాలీవుడ్‌కు చెందిన త్రిప్తి దిమ్రి ‘యానిమల్’తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చారు. యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంతో త్రిప్తి యువ హృదయాలను కొల్లగొట్టారు.