Vijay Deverakonda | టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట, గతంలో తమ ఫామ్‌హౌస్‌లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న సందర్భంగా ఒక కలల ప్రాజెక్ట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకటనను నిజం చేస్తూ, విజయ్ దేవరకొండ తన తండ్రి పుట్టిన సొంత ఊరైన నాగర్‌కర్నూల్ జిల్లాలోని తుమ్మన్‌పేట గ్రామానికి రష్మికతో కలిసి నేడు విచ్చేశారు.
పెళ్లి తర్వాత మొదటిసారిగా రష్మికతో కలిసి సొంతూరికి వచ్చిన విజయ్, గ్రామాభివృద్ధిపై తనకున్న ఆలోచనలను అక్కడి ప్రజలతో పంచుకోబోతున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 9, 10 తరగతుల విద్యార్థుల కోసం ప్రత్యేక స్కాలర్షిప్ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించబోతున్నాడు.
అలాగే కష్టపడి చదివి, మంచి మార్కులు సాధించిన 180 మంది ప్రతిభావంతులైన విద్యార్థుల (Merit Students) జాబితాను ఈ సందర్భంగా వారు విడుదల చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్కరి చదువూ ఆగిపోకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ 180 మంది విద్యార్థుల చదువుకు అయ్యే పూర్తి ఖర్చును తామే చూసుకుంటామని ఈ దంపతులు భరోసా ఇచ్చారు. తమ పిల్లల భవిష్యత్తుకు అండగా నిలిచిన విజయ్-రష్మికలపై గ్రామస్థులతో పాటు నెటిజన్లు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.