Operation Sindoor | జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి చర్యకు సంబంధించి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి 1.44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. పాకిస్థాన్ దాదాపు 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయగా.. ఇందులో 70 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. అయితే భారత సైన్యం చేసిన ఆపరేషన్‌పై ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. మేమంతా మీ వెంటే ఉంటామంటూ భారత సైన్యానికి మద్దతుగా పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా నటుడు విజయ్ దేవరకొండ కూడా భారత సైన్యానికి మద్దతుగా పోస్ట్ పెట్టాడు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో దేశంలోని మన సైనికులు, మహిళలు, అమాయక ప్రజలందరి భద్రత కోసం ప్రార్థిస్తున్నాను. భవిష్యత్తులో ‘ఉగ్రవాదం’, ‘దాడులు’ అనే పదాలు వినిపించని ఒక కొత్త శకం కోసం మనమందరం ఎదురుచూస్తున్నాం. ప్రతి ఒక్కరూ తమ జీవితాలను స్వేచ్ఛగా గడపాలని ఆశిస్తున్నాను. అందరూ శాంతియుతంగా, సుసంపన్నంగా మరియు ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాము. జై హింద్ #ఆపరేషన్ సిందూర్ అంటూ విజయ్ దేవరకొండ రాసుకోచ్చాడు.