అగ్ర కథానాయిక అనుష్క వెండితెరపై కనిపించి చాలా కాలం అయ్యింది. కమర్షియల్ పంథాకు భిన్నమైన ఇతివృత్తాల్ని ఎంచుకునే ఆలోచనలో ఉన్న ఆమె తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందనున్న ఓ ప్రేమకథా చిత్రంలో అనుష్క నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. 25 ఏళ్ల యువకుడికి, నలభై ఏళ్ల మహిళకు మధ్య సాగే ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కీలక పాత్రలో విజయ్ దేవరకొండ నటించనున్నట్లు తెలిసింది. కథాగమనంలో అతడి పాత్ర కీలకంగా ఉంటుందని సమాచారం. ప్రథమార్థంలో విజయ్ కనిపిస్తారని చెబుతున్నారు. మహేష్ ఈ సినిమాను దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నట్లు తెలిసింది.