Vijay Devarakonda | రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చివరగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘కింగ్డమ్’ మిశ్రమ స్పందన దక్కించుకుంది. కమర్షియల్‌గా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. నిజానికి ‘గీత గోవిందం’ తర్వాత విజయ్ ఖాతాలో భారీ సాలిడ్ హిట్ పడలేదు. మధ్యలో వచ్చిన ‘ఖుషి’ ఓ మోస్తరు సంతృప్తినిచ్చినా, ఆ తర్వాత సినిమాలు అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ పరిస్థితుల్లో విజయ్ ప్రస్తుతం చేస్తున్న రెండు కొత్త సినిమాలపై భారీ ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ దర్శకుడు రవికిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్థన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. దీనితో పాటు దర్శకుడు రాహుల్ సంకృత్యన్‌తో కలిసి ‘వీడీ14’ అనే వర్కింగ్ టైటిల్‌తో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చేస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘టాక్సీవాలా’ డీసెంట్ హిట్‌గా నిలిచినా, పైరసీ కారణంగా పూర్తి స్థాయిలో ఫలితం అందుకోలేకపోయింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా పీరియాడికల్, హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతున్నట్లు సమాచారం.
ఇటీవల ‘వీడీ14’కు సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విజయ్ దేవరకొండ అభిమాని ఒకరు దర్శకుడు రాహుల్ సంకృత్యన్కు ఎమోషనల్ లేఖ రాస్తూ, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత తన హీరోకు సరైన హిట్ పడలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతి సినిమాకూ ఫ్రెండ్స్, ఫ్యామిలీని తీసుకెళ్లినా ప్రతిసారి నిరాశే ఎదురవుతోందని, కనీసం ఈ సినిమాతో అయినా విజయ్ను సక్సెస్ ట్రాక్‌లో నిలబెట్టాలని వేడుకున్నాడు. అలాగే సినిమా స్క్రిప్ట్ నుంచి ఫస్ట్ కాపీ రెడీ అయ్యే వరకూ విజయ్, దర్శకుడు ఇద్దరూ ప్రతి దశను జాగ్రత్తగా చూసుకోవాలని అభిమాని కోరాడు. ఈ లేఖకు రాహుల్ సంకృత్యన్ ఇచ్చిన స్పందన ఇప్పుడు అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. “విజయ్ దేవరకొండ అభిమానుల ఆకలిని తీర్చేలా ‘వీడీ14’ ఉంటుంది. ఇది నా హామీ” అంటూ ఆయన ఇచ్చిన సమాధానం సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. ఈ ఒక్క రిప్లైతోనే సోషల్ మీడియాలో ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చ ఊపందుకుంది.