తనను చిన్నచూపు చూసే సమాజం భవితను మార్చిన ఓ వ్యక్తి కథతో రూపొందుతోన్న చిత్రం ‘తుఫాన్’. విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజయ్ మిల్టన్ దర్శకుడు. కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మాతలు. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న ఈ సినిమాను జూన్‌లో గ్రాండ్‌గా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. చిత్రబృందం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ ‘ అందరికీ నచ్చే యాక్షన్ ప్యాక్డ్ మూవీ ‘తుఫాన్’. ఎన్నో గొప్ప సినిమాలకు ఛాయాగ్రహణం అందించి డీవోపీగా తనేంటో ఇప్పటికే నిరూపించుకున్న విజయ్ మిల్టన్ ఈ సినిమాతో దర్శకుడిగా సత్తాచాటనున్నారు. ఆయనతో పనిచేయడం ఆనందంగా ఉంది. సత్యరాజ్, శరత్‌కుమార్, డాలీ ధనుంజయ వంటి గ్రేట్ ఆర్టిస్టులు ఈ సినిమాలో భాగమయ్యారు.
సాంకేతికంగా కూడా నెక్ట్స్ లెవల్లో ఉంటుందీ సినిమా. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రం రూపొందుతున్నది.’ అని తెలిపారు. ఒక దీవిలో జరిగే కథ ఇదని, ఒక అపరిచిత వ్యక్తి సమాజంలోకి అడుగుపెట్టాక ఈ కథ మొదలవుతుందని, తుఫాన్ వచ్చే ముందు ఎలా ప్రశాంతంగా ఉంటుంటో ఇందులో హీరో పాత్ర అలా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు.