Vidya Balan | బాలీవుడ్ నటి విద్యా బాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 22 సంవత్సరాలు అయినా.. ఇప్పటికీ తనదైన అభినయంతో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటూ వస్తున్నది. హిందీతో పాటు బెంగాళీ, మలయాళం, తమిళ భాషల్లోనూ తన ప్రతిభను చాటిన ఆమె.. 2019లో తెలుగు సినీరంగంలోకి ‘ఎన్టీఆర్: కథానాయకుడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘జటాధర’ అనే సినిమాలో ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఓ చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కెరీర్ పరంగా బిజీగా ఉండే విద్యా బాలన్ తన అభిప్రాయాలను కూడా నిర్భయంగా వ్యక్తపరుస్తూ వస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. సినీ పరిశ్రమలో మార్పులు అనివార్యమని, కాలానుగుణంగా నటీనటులూ మారాలని ఆమె సూచించారు. ముఖ్యంగా హీరోయిన్లు అవకాశాలను బట్టి తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుంటూ ఉండాలి అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అప్పుడే వారు దీర్ఘకాలం పరిశ్రమలో కొనసాగగలరని.. లేకపోతే అభిమానులకు దూరవుతారని.. ఫేడవుట్ అవుతారని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, చిన్నతనంలో తాను చాలా అల్లరి చేసేవాడినని, రాత్రిళ్లు మేలుకొని ఉండటం తన అలవాటని, ఆ అలవాటును విడిచిపెట్టడం పెద్ద సవాలుగా మారిందని చెప్పారు. సినిమాలు తన జీవితంలో కీలకపాత్ర పోషించాయని, అవే తనను పూర్తిగా మార్చేశాయని వెల్లడించారు. పెళ్లి తర్వాత కూడా సినిమాలలో కొనసాగడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా.. విద్యా బాలన్ చివరిసారిగా భూల్ భూలైయా 3 మూవీలో కనిపించారు.