ఛత్రపతి శంభాజీ మహారాజ్‌గా ‘చావా’ చిత్రంలో నట విశ్వరూపాన్ని చూపించి, దేశవ్యాప్తంగా జేజేలు అందుకుంటున్నారు నటుడు విక్కీ కౌశల్. ఇప్పటికే 700కోట్ల వసూళ్లను దాటి దూసుకుపోతున్నదా సినిమా. ఇదిలావుంటే.. విక్కీకౌశల్ నటిస్తున్న మరో ప్రతిష్టాత్మక పానిండియా సినిమా ‘మహావతార్’. ఇందులో ఆయన మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన పరశురాముడిగా కనిపించనున్నారు. చిరంజీవి అయిన భార్గవరాముడు.. నైతిక విలువలు నశిస్తున్న సమాజాన్ని సరిచేసేందుకు మళ్లీ పరశుని చేతబూని జనజీవన స్రవంతిలోకి అడుగుపెడితే ఎలా ఉంటుంది? అనే ఊహాజనిత కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నదని తెలుస్తున్నది. పౌరాణిక ఇతివృత్తం కూడా మిళితమై ఈ సినిమా ఉంటుందట. పరశురాముడిగా ఇటీవల విడుదలైన విక్కీ కౌశల్ లుక్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో దినేష్ విజన్, మాడ్డాక్ ఫిల్మ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.