Vicky Kaushal | ‘ఛావా’లో నేను పోషించిన శంభాజీ పాత్ర సాహసవంతమైనది. అయితే.. ఆ పాత్ర పోషణ కోసం నేను నిజంగానే సాహసాలు చేయాల్సొచ్చింది. నా కెరీర్లో అతి కష్టమైన పాత్ర శంభాజీ మహారాజ్ పాత్ర.’ అని చెప్పారు హీరో విక్కీ కౌశల్. ఆయన ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘ఛావా’. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో శంభాజీగా విక్కీ నటించగా, ఆయన భార్య యేసుభాయ్ పాత్రను రష్మిక పోషించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకుడు. ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా విక్కీ కౌశల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఛావా’ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ‘సినిమా ఒప్పుకున్నప్పుడే దర్శకుడు లక్ష్మణ్ చెప్పారు.
‘నాకు జానాన్ని మోసం చేయడం చేతకాదు. అందుకే వీఎఫ్ఎక్స్ వాడను. సాధ్యమైనంతవరకూ సహజంగానే తీస్తా. గుర్రపు స్వారీ, కత్తి సాము, అభినయం, ఫైట్స్.. ఇలా అన్ని విషయాల్లో సంతృప్తి చెందేవరకూ షూట్ మొదలుపెట్టను.. నువ్వు సహకరించగలిగితేనే చెయ్..’ అని నిర్మొహమాటంగా చెప్పేశారు. ఆయనలోని నిజాయితీ నచ్చి, పూర్తిగా సహకరించా. ధృఢకాయం కోసం కఠోరమైన వర్కౌట్లు చేశా. సుమారు ఏడు నెలలు కష్టపడ్డాక అనుకున్నది సాధించా. పాత్రకోసం జుత్తు, గడ్డం పెంచా. ఇందులో ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటించారు. తన నటనతో పాత్రకు ప్రాణం పోశారు. రెండువేల మంది జూనియర్ ఆర్టిస్టులు, 500మంది స్టంట్ మాస్టర్స్ ఈ సినిమాకోసం పనిచేశారు. ఏ విషయంలోనూ దర్శకుడు రాజీ పడలేదు. విడుదల రోజు దగ్గర పడుతున్న కొద్దీ ఉద్విగ్నత ఎక్కువైపోతోంది. సినిమా తప్పకుండా నచ్చుతుందని నమ్మకంతో ఉన్నాం’ అని తెలిపారు విక్కీ కౌశల్.