బాలీవుడ్ ప్రేమజంట విక్కీ కౌశల్, కత్రినాకైఫ్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఏడడుగుల బంధంతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. వీరి వివాహం గురువారం రాజస్థాన్లోని భర్వారా కోట సిక్స్సెన్సెస్ రిసార్ట్లో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు కొద్ది మంది బాలీవుడ్ ప్రముఖులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. వివాహ ఘట్టంలో భర్త విక్కీ కౌశల్ మెడలో పూల మాల వేస్తున్న ఓ ఫొటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నది కత్రినాకైఫ్. ‘ హృదయాల్లోని ప్రేమ, పరస్పర విశ్వాసం ఈ అందమైన క్షణాల వరకు మమ్మల్ని నడిపించింది . మేము ఇద్దరం కలిసి ఆరంభిస్తున్న ఈ సరికొత్త ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు, దీవెనలను కోరుతున్నాం’ అంటూ పేర్కొన్నది. ఈ కొత్త జంటకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలందజేశారు. నాలుగు రోజుల పాటు జరిగిన విక్కీ-కత్రినాకైఫ్ పెళ్లి వేడుక తాలూకు వీడియో హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఎనభై కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. జనవరిలో ఈ పెళ్లి వీడియోను విడుదలచేయనున్నట్లు తెలిసింది.