Bollywood | బాలీవుడ్ క్రేజీ హీరో విక్కీ కౌశల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించిన విక్కీ కౌశల్ లవ్ శవ్ తే చికెన్ ఖురానాలో చిన్న పాత్రతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత బాంబే వెల్వెట్, మసాన్, జుబాన్ వంటి చిత్రాలతో ప్రేక్షకులని పలకరించారు. 2018 లో విడుదలైన రాజీ చిత్రంతో ఆయనకు గుర్తింపు లభించింది. ఇప్పుడు విక్కీ కౌశల్ 5 సినిమాలని లైన్లో పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన లవ్ అండ్ వార్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, మూవీ 2026 లో విడుదల కావచ్చు. ఈ చిత్రంలో విక్కీతో పాటు ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
మరోవైపు విక్కీ కౌశల్ లాహోర్ 1947 చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో సన్నీ డియోల్, ప్రీతి జింటా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో మహావతార్ ఎన్ ఎపిక్ సాగా చిత్రం రూపొందుతుండగా, ఇందులో విక్కీ పరశురాముడి పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణం జరుగుతోంది. దర్శక నిర్మాత కరణ్ జోహార్ మల్టీస్టారర్ చిత్రం తఖ్త్‌లో కూడా విక్కీ కౌశల్ నటిస్తుండగా, ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. పలు కారణాల వలన ఈ చిత్రం నిలిచిపోయింది. త్వరలో తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
మరోవైపు ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ అనే చిత్రంలో కూడా విక్కీ కౌశల్ నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ సంవత్సరం విడుదలైన ఛావా చిత్రంతో విక్కీ కౌశల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌కి హిట్స్ లేని సమయంలో రష్మిక మందన్నాతో కలిసి నటించిన ఈ చిత్రం 807.40 కోట్ల వసూళ్లు సాధించింది. 140 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, ఈ మూవీ భారీ వసూళ్లు రాబడుతుంది. తెలుగులోను విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లే రాబట్టింది.