తన సినిమా టైటిల్స్ విషయంలో అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తెలుగుదనాన్ని ప్రతిబింబిస్తూ కుటుంబ ప్రేక్షకులు మెచ్చే టైటిల్స్‌కు ప్రాధాన్యతనిస్తారు. ముఖ్యంగా ‘అ’ అక్షరంతో మొదలయ్యే టైటిల్స్ ఆయనకు సెంటిమెంట్. తాజాగా ఆ సెంటిమెంట్‌ను పునరావృతం చేస్తూ వెంకటేష్‌తో తాను రూపొందిస్తున్న చిత్రానికి ‘ఆదర్శకుటుంబం హౌస్ నెం: 47’ అనే టైటిల్‌ను పెట్టారు త్రివిక్రమ్. ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్‌గా ‘ఏకే-47’ అని పెట్టడం ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తున్నది.
బుధవారం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెడుతూ టైటిల్‌ను ప్రకటించారు. వెంకటేష్ నటిస్తున్న 77వ చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. కుటుంబ భావోద్వేగాలు, వినోదం కలబోసిన కథాంశమిదని, త్రివిక్రమ్ తనదైన శైలి హాస్యంతో తెరకెక్కించబోతున్నారని మేకర్స్ తెలిపారు. వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావు’ ‘మల్లీశ్వరి’ చిత్రాలకు త్రివిక్రమ్ సంభాషణలను అందించారు. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న తాజా సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురాబోతున్నది.