Venkatesh | విక్టరీ వెంకటేష్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కూడా తిరగరాస్తున్నాడు. ఆయన చివరి చిత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా 300కిపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు త్రివిక్రమ్‌తో చిత్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో వీరిద్దరూ సంచలన విజయం సాధించారు. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే త్రివిక్రమ్ ఆ రెండు చిత్రాలకి రచయితగా పని చేస్తే తాజా చిత్రానికి దర్శకుడిగా వర్క్ చేయనున్నారు.
ఇక వెంకటేష్ – త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కబోయే కొత్త చిత్రానికి ‘వెంకటరమణ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాకి డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేసినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. అబ్బాయి గారు 60+ అనే టైటిల్‌ని త్రివిక్రమ్-వెంకీ మూవీకి అనుకున్నట్టు టాక్. మరి దీనికి సంబంధించి క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసిన వినోదభరితమైన చిత్రమవుతుందని చెబుతున్నారు. త్రివిక్రమ్ ఇప్పటికే స్క్రిప్ట్‌ను ఫినిష్ చేశారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఓ మిడిల్ క్లాస్ కుటుంబానికి సంబంధించిన భావోద్వేగాలు, హాస్యం మేళవించిన కథతో ఈ సినిమా ఉండబోతోందట.
గతంలో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రాల్లో వెంకటేష్‌కి జోడీగా నటించిన త్రిషను చిత్రంలో కథానాయికగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గతంలో రుక్మిణి వసంత్ పేరు వినిపించినా, ఇప్పుడు త్రిషపై ఆసక్తి చూపుతున్నట్టు టాక్. త్రివిక్రమ్- త్రిష ‘అతడు’ సినిమా తర్వాత మళ్లీ కలిసి చేసింది లేదు. ఇక ఈ చిత్ర షూటింగ్‌ను మూడు నుంచి నాలుగు నెలల వ్యవధిలో పూర్తిచేసి, త్వరగా సినిమాను థియేటర్లకు తీసుకురావాలన్నది త్రివిక్రమ్ ప్లాన్. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్..ఎన్టీఆర్‌తో మైథాలజికల్ పాన్ ఇండియా ఫాంటసీ ప్రాజెక్ట్ మొదలు పెట్టనున్నాడు.