Venkatesh | అగ్ర నటుడు వెంకటేశ్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శిరీష్ నిర్మాతగా దిల్‌రాజు సమర్పణలో రూపొందుతోన్న ఈచిత్రం పొల్లాచ్చిలో భారీ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. నెలరోజులకు పైగా జరిగిన ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై పాటలు, యాక్షన్ పార్ట్‌తో కూడిన కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
వినాయకచవితి పర్వదినం సందర్భంగా సెట్లోని ఆహ్లాదకరమైన వాతావరణం చూపించే గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘A day without laughter is a day wasted..’ అనే చార్లీ చాప్లిన్ కోట్ సూచిస్తూ నటీనటుల మధ్య ఆనందాన్ని, స్నేహాన్ని ఈ వీడియోలో ఆవిష్కరించారు.
వెంకటేష్ సంప్రదాయ దుస్తుల్లో కళ్లద్దాలతో కనిపించగా, ఐశ్వర్యరాజేష్ ఆయన భార్య భాగ్య పాత్రలో, క్లాసిక్ చీరలో దర్శనమిచ్చింది. అలాగే మీనాక్షి చౌదరి ఎక్స్‌లవ్ పాత్రలో మోడ్రెన్ అవతార్‌లో కనిపించింది. మున్నార్ దగ్గర ఇంటర్వెల్ సీక్వెన్స్ చిత్రీకరించామని, సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.
ఉపేంద్ర లిమాయే, రాజేంద్రప్రసాద్, సాయికుమార్, నరేష్, వీటీ గణేశ్, మురళీధర్‌గౌడ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణం: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్.