తన మాటలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్థుల్ని చేసిన రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన మాటల వల్లే ఆడిన సినిమాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం దర్శకుడిగా కూడా విభిన్నమైన కథలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారాయన. నిజానికి ‘గుంటూరు కారం’ తర్వాత ఓ భారీ పౌరాణిక చిత్రానికి రంగం సిద్ధం చేసుకున్నారు త్రివిక్రమ్. కార్తికేయ పురాణం ఆధారంగా ఆయన రూపొందించే ఈ సినిమాలో కార్తికేయుడిగా ఎన్టీఆర్ కనిపిస్తారనే వార్తలు కూడా వచ్చాయి.
అయితే.. అప్పటికే ఎన్టీఆర్‌కు ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమాకు ప్రస్తుతానికి బ్రేక్ పడింది. దాంతో త్రివిక్రమ్ మరో కథను రెడీ చేసి, వెంకటేశ్‌తో ‘ఆదర్శకుటుంబం’ సినిమాను ప్రకటించారు. ‘ఏకే 47’ అనేది ఉపశీర్షిక. టైటిల్ ఫాంట్లో ఆయన ఇచ్చిన బ్లడ్ కలర్ సినిమా జానర్‌ని ప్రజెంట్ చేస్తున్నది.
ఇప్పటివరకూ త్రివిక్రమ్ థ్రిల్లర్ సినిమాల జోలికి పోలేదు. అలాంటి ఆయన టైటిల్లో రక్తపు మరకలు కనిపించడం ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది. కెరీర్లోనే తొలిసారిగా ఓ ఫ్యామిలీ థ్రిల్లర్‌ని త్రివిక్రమ్ రాశారని వినికిడి. ఎప్పుడూ సరదా సినిమాలతో సందడి చేసే త్రివిక్రమ్ థ్రిల్లర్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఆయన అభిమానులు కూడా ఆశిస్తున్నారు. మరి ఆ ముచ్చట ఎలా ఉంటుందో చూడాలి.