సృష్టి డాంగే నాయికగా నటిస్తున్న సినిమా ‘వీరఖడ్గం’. ఈ చిత్రాన్ని వీవీవీ ప్రొడక్షన్స్ పతాకంపై కె.కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఎంఏ చౌదరి దర్శకుడు. ఈ నెల మూడో వారంలో విడుదలకు ఈ సినిమా సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు ఎంఏ చౌదరి మాట్లాడుతూ…‘300 ఏళ్ల క్రితం జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. చరిత్ర కాలగర్భంలో కలిసినా దాని ఆనవాళ్లు ఎక్కడో ఒక చోట ఉంటాయి. అలాగే మనిషి అంతమైనా పగ జన్మజన్మలకూ వెంటాడుతుంది. పగ సాధించే క్రమంలో ఓ యువతి ఎలాంటి పోరాటం చేసింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. గ్రాఫిక్స్కు ప్రాధాన్యత ఉన్న చిత్రమిది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందించాం’ అన్నారు. బ్రహ్మానందం, సత్య ప్రకాష్, ఆనంద్ రాజ్, మదన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ : సునీల్ కుమార్, సంగీతం : షాయక్ పర్వేజ్.