అగ్ర హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది రెండు భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న ‘రౌడీ జనార్దన’ చిత్రీకరణ జరుపుకుంటున్నది. కోనసీమ నేపథ్యంలో సాగే రూరల్ యాక్షన్ డ్రామా ఇది. దీనితో పాటు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా పీరియాడిక్ మూవీ షూటింగ్లో విజయ్ దేవరకొండ పాల్గొంటున్నారు.
‘వీడీ14’ అనే వర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. 19 శతాబ్దం నాటి బ్రిటీష్ ఇండియా నేపథ్యంలో సాగే ఈ కథలో విజయ్ దేవరకొండ పాత్ర నవ్యరీతిలో ఉంటుందని చెబుతున్నారు. రాయలసీమ బ్యాక్‌గ్రౌండ్‌లో సాగే ఈ కథ కోసం విజయ్ దేవరకొండ అక్కడి యాసలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు.
గత ఏడాది విడుదల చేసిన గ్లింప్స్ కథపై ఆసక్తిని పెంచింది. తాజా సమాచారం ప్రకారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న సినిమా టైటిల్‌ను ప్రకటించబోతున్నట్లు మేకర్స్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ఈ పీరియాడిక్ డ్రామా టైటిల్ ఏమిటోనని అభిమానులు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. మొత్తంగా ఈ సంవత్సరం రెండు భారీ పీరియాడిక్ సినిమాలతో విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ‘వీడీ14’ దసరాకు, ‘రౌడీ జనార్దన’ డిసెంబర్ నెలాఖరులో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.