Varanasi | ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన సమాచారం ఒక్కొక్కటిగా బయటికి వస్తుండడంతో సినీ ప్రియులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు రుద్ర పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన చిన్నప్పటి పాత్ర సుధీర్ బాబు కొడుకు దర్శన్ చేయబోతున్నాడని ప్రచారం నడుస్తుంది. 2027లో విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా స్లో అండ్ స్టడీగా సాగుతున్నాయి.
పాన్ ఇండియా మూవీ ‘వారణాసి’ పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇన్నాళ్లుగా SSMB29 పేరుతో ప్రచారం సాగిన ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఇటీవల ‘గ్లోబ్ ట్రోటర్’ ఈవెంట్ నిర్వహించి అధికారిక టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ మహాయజ్ఞానికి అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చి వేడుకను విజయవంతం చేశారు. టైటిల్ గ్లింప్స్‌లో మహేష్ బాబు రూపం, ముఖ్యంగా నందీశ్వరుడి నేపథ్యంపై వచ్చిన ఆయన ఎపిక్ ఎంట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాలోలాగే వృషభం (బుల్ మోడల్)పై మహేష్ ఇచ్చిన పవర్ఫుల్ ఎంట్రీ అభిమానులను కేకలతో, చప్పట్లతో కట్టిపడేసింది.
తాజాగా సినిమా టీమ్ విడుదల చేసిన బిహైండ్-ది-సీన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. వృషభం సెట్ చేయడం నుంచి మహేష్ ఎంట్రీ వరకు, జక్కన్న ప్రతి ఫ్రేమ్‌ను ఎంత పర్ఫెక్ట్గా తీర్చిదిద్దారో ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా కోసం కష్టపడ్డట్టు ఈవెంట్ కోసం రాజమౌళి ప్రత్యేకంగా చాలా ఎఫర్ట్ పెట్టినట్టు వీడియోని చూస్తే మనకు అర్ధమవుతుంది.ఇది చూసిన ఫ్యాన్స్.. రాజమౌళి డెడికేషన్ వేరే లెవెల్, మహేష్ ఎంట్రీ గూస్బంప్స్, సినిమా కోసం ఇంత కష్టమా? జక్కన్న అంటే ఇదే అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘వారణాసి’లో మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపించనుండగా, ప్రియాంక చోప్రా మందాకినీగా కీలక పాత్రలో నటిస్తున్నారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా విజువల్ స్పెక్టాకిల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.