ఇటీవలే ‘వారణాసి’ సినిమా విడుదల తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే. మహేష్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్లోబల్ యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే దాదాపు 30 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్, గ్రాఫిక్ హంగులకు ప్రాధాన్యం ఉండటంతో ఈ సినిమాను అనుకున్న ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారట దర్శకుడు రాజమౌళి. ‘వారణాసి’ ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్నది.
తాజా సమాచారం ప్రకారం కీలక షెడ్యూల్ కోసం చిత్రబృందం త్వరలో జార్జియాకు పయనం కానున్నట్లు తెలిసింది. ప్రధాన తారాగణం పాల్గొనగా అక్కడ కొన్ని ముఖ్య ఘట్టాలను తెరకెక్కిస్తారట. భారతీయ పురాణాలతో ముడిపడిన సాహసగాథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఐమాక్స్ ఫార్మాట్‌తో చిత్రీకరిస్తున్న ఈ సినిమాను పలు భారతీయ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ప్రియాంకచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరుల ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు.