చూడగానే ప్రేక్షకుల్ని ఆకర్షించే అందాల తార వాణీ కపూర్. ఆమె నట ప్రతిభను అందం డామినేట్ చేస్తుంటుంది. అందుకే వాణీ నటన గురించి తక్కువగా అందం గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. అయినా సంతృప్తిపడక నటిగా పేరు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నదీ నాయిక. ‘బేఫికర్’, ‘వార్’, ‘బెల్‌బాటమ్’, ‘చంఢీగడ్ కరే ఆషికీ’, ‘బదాయి దో’ లాంటి చిత్రాలతో బాలీవుడ్లో అగ్రతారగా పేరు తెచ్చుకుంది వాణీ కపూర్. గతేడాది ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘షంషేరా’ పరాజయం పాలవడం వాణీకి నిరాశే మిగిల్చింది.
రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ భారీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఆ చేదు ఫలితాన్ని మర్చిపోయి ఆత్మవిశ్వాసంతో తన కొత్త చిత్రంలో అడుగుపెడుతున్నదీ భామ. ‘మర్దానీ 2’ చిత్ర దర్శకుడు గోపీ పుత్రన్ తెరకెక్కించనున్న చిత్రంలో హీరోయిన్గా వాణీ కపూర్ నటిస్తున్నది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమా కథ ఆమెను ఎంతో ఎైగ్జెట్ చేసిందని, ఉరిమే ఉత్సాహంతో సినిమా కోసం సన్నాహాలు ప్రారంభించిందని సమాచారం. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని వాణీ నమ్మకంగా ఉందట.