దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా జంటగా రూపొందిన చిత్రం ‘ఉత్సవం’. అర్జున్‌సాయి రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సురేశ్ పాటిల్ నిర్మాత. ఈ నెల 13న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. బ్రహ్మానందం స్టేజ్ ప్లేలో చెప్పిన పవర్ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది.
‘మన బ్రతుకులు కలలు కావు.. కళలని గుర్తించే రోజులు రావా..’ అని ప్రకాశ్‌రాజ్ చెప్పిన డైలాగ్ కథలోని ఆత్మని ప్రజెంట్ చేసింది. నాటకరంగం చుట్టూ సాగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్టు ట్రైలర్ చెబుతున్నది. ఇందులో కృష్ణగా దిలీప్‌ప్రకాశ్, రామగా రెజీనా కసాండ్రా కనిపిస్తారు.
వారి ప్రేమకథ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ అని మేకర్స్ చెబుతున్నారు. ప్రేమ, భావోద్వేగాల మేళవింపుగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, నాజర్, అలీ, ప్రేమ, ఎల్బీ శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: రసూల్ ఎల్లోర్, సంగీతం: అనూప్ రూబెన్స్.