అగ్ర హీరో పవన్‌కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. శనివారం ఏపీలోని రాజమండ్రిలో ‘దేఖ్లేంగే సాలా..’ అనే తొలి గీతాన్ని విడుదల చేశారు. దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ఈ పాట మాస్, ఆధునిక అంశాల కలబోతగా హుషారైన బీట్తో సాగింది. పవన్‌కల్యాణ్ తనదైన శైలి సిగ్నేచర్ స్టెప్పులతో అభిమానుల్లో జోష్ నింపారు. ‘బే ఆఫ్ బెంగాల్ పొంగుతున్నా.. రే ఆఫ్ హోపే తగ్గుతున్నా.. దేఖ్లేంగే సాలా..చూసినాంలే చాలా..’ అంటూ ఉల్లాసభరితంగా సాగిందీ గీతం. ఈ సందర్భంగా దర్శకుడు హరీశ్‌శంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం పవన్‌కల్యాణ్ ప్రాణం పెట్టి పనిచేశారని, కొంచెం ఆలస్యమైనా అభిమానులు మళ్లీ మళ్లీ చూసే విధంగా సినిమాను తీర్చిదిద్దామని తెలిపారు.
మనకేమైనా సమస్యలొచ్చినప్పుడు స్ఫూర్తినిచ్చేలా ఈ పాట ఉంటుందని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ చెప్పారు. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతీ కంటెంట్ అద్భుతంగా ఉంటుందని, మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని నిర్మాత నవీన్ యెర్నేని ధీమా వ్యక్తం చేశారు. పవన్‌కల్యాణ్ ఫేమస్ డైలాగ్ ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ స్ఫూర్తిగా తీసుకొని ఈ పాట రాశానని గీత రచయిత భాస్కరభట్ల పేర్కొన్నారు. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి.