సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ‘యూరి’ సినిమా తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నారు దర్శకుడు ఆదిత్యధర్. సినిమా పరిశ్రమలో తొలి విజయం కంటే మలి విజయం విలువైందంటారు. కెరీర్‌కి బలమైన పునాది ఏర్పడాలంటే సెకండ్ హిట్ ముఖ్యం. దానికి తగ్గట్టే ‘ధురంధర్’తో అపూర్వ విజయాన్ని అందుకున్నారాయన. రూ.1000కోట్ల విజయంతో బాలీవుడ్ గౌరవాన్ని పెంచారు. ‘ధురంధర్ 2’ ఈ ఏడాది మార్చిలో విడుదల కానున్నది. ప్రస్తుతం ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఇదిలావుంటే.. ‘ధురంధర్’ ఫ్రాంచైజీ తర్వాత ఆదిత్యధర్ నుంచి వచ్చే సినిమా ఏమిటి? అని బాలీవుడ్లో వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఆదిత్యధర్ జన్మతః కాశ్మీరీ పండిట్. ఉగ్రవాదంపై, ఉగ్రవాద బాధితుల జీవితాలపై అతని అవగాహనకు కారణం అదే. యురి, ధురంధర్ చిత్రాలు అంతబాగా తీయడానికి గల కారణం కూడా అదేనంటారు. బాలీవుడ్ తాజా సమాచారం ప్రకారం…పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఇతివృత్తాన్ని సినిమాగా తీయాలని ఆదిత్యధర్ భావిస్తున్నారట. సినిమా పేరు కూడా ‘ఆపరేషన్ సిందూర్’ అని నిర్ణయించారని సమాచారం.