కొత్త సంవత్సరం మొదలైంది. సంక్రాంతి హంగామా ఊపందుకున్నది. బరిలో దిగబోయే కోడిపుంజులు ఇప్పటికే తేదీలను ఖరారు చేసుకొని యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఇదే తగిన సమయం అన్నట్టు.. నిర్మాణం తుదిదశకు చేరుకున్న సినిమాలు, నిర్మాణంలో ఉన్న సినిమాలు, బడా సినిమాలు, బడ్జెట్ సినిమాలు.. ఇలా అన్నీ.. కొత్త కొత్త స్టిల్స్‌తో, ఆసక్తికరమైన పోస్టర్లతో సందడి చేస్తున్నాయి. కొత్త సంవత్సరం సినిమా పండుగను పురస్కరించుకొని.. నిర్మాతలు ప్రమోషన్స్‌ని పరుగులు పెట్టిస్తున్నారు. అ సందర్భంగా గురువారం పలు చిత్రాల ఫస్ట్‌లుక్ పోస్టర్స్ తళుక్కున మెరిశాయి. గత ఏడాది తెలుగు సినిమాకు అంతగా కలిసి రాకపోవడంతో.. ఈ నవ వసంతంలో అంతా శుభం చేకూరాలని, టాలీవుడ్ పునర్వైభవం పొందాలని ఆకాంక్షిస్తూ కోటి ఆశలతో తారాలోకం 2026లోకి అడుగుపెట్టింది..
గతేడాది‘ఓజీ’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న అగ్ర హీరో పవన్‌కల్యాణ్ ఈ వేసవికి ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. హరీశ్‌శంకర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. ఇటీవల విడుదల చేసిన ‘దేఖ్లేంగే సాలా..’ పాట సోషల్‌మీడియాలో రికార్డు స్థాయి వీక్షణలతో సంచలనం సృష్టించింది. న్యూ ఇయర్ సందర్భంగా గురువారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో పవన్‌కల్యాణ్ ఓ చేతిలో గన్, మరో చేతిలో రేడియో పట్టుకొని ైస్టెలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పోలీస్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది.
కొత్త సంవత్సరం ఆరంభంలో ప్రభాస్ అభిమానులకు ఇది నిజంగా డబుల్ బొనాంజానే. ఓవైపు ఆయన నటించిన కామెడీ హారర్ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’ ఈ నెల 9న విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు పాన్ ఇండియా స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తున్న ‘స్పిరిట్’ పవర్ఫుల్ ఫస్ట్‌లుక్ రిలీజ్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్‌ఖుషీ అవుతున్నారు. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో పోలీస్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘స్పిరిట్’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ మునుపెన్నడూ చూడని రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించారు.
ఒళ్లంతా గాయాలతో అక్కడక్కడా బ్యాండేజ్‌లు వేసుకొని వెనక్కి తిరిగి నిల్చున్న ఈ స్టిల్ విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. గత చిత్రాలకు మించిన హైవోల్టేజ్ యాక్షన్‌తో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్’ను తీర్చిదిద్దుతున్నారని స్టిల్‌ని చూస్తే అర్థమవుతున్నది. ‘ఇండియన్ సినిమా..మీ ఆజానుబాహుడుని చూడండి. హ్యాపీ న్యూ ఇయర్ 2026’ అని సందీప్‌రెడ్డి వంగా ఈ స్టిల్ గురించి వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్నది. తొమ్మిది భాషల్లో విడుదల చేయబోతున్నారు.
నాని కథానాయకుడిగా రూపొందుతున్న హైదరాబాద్ నేపథ్య పీరియాడిక్ డ్రామా ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మార్చి 26న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. నూతన ఏడాదిని పురస్కరించుకొని కొత్త స్టిల్‌ని విడుదల చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశాయి. ఇందులో నాని జడల్ అనే వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు. తన జాతికోసం ఆధిపత్య శక్తులతో ఆయన చేసే పోరాటం ఉద్వేగభరితంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. మోహన్‌బాబు, రాఘవ్ జుయల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, రచన-దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల.
యువహీరో అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాయలసీమ నేథఫ్యంలో సాగే కథ ఇది. కొద్ది మాసాల క్రితం విడుదల చేసిన గ్లింప్స్‌లో అఖిల్ రా అండ్ రస్టిక్ రోల్లో కనిపించారు. రాయలసీమ యాసలో ఆయన చెప్పిన సంభాషణలు కూడా ఆకట్టుకున్నాయి. గ్రామీణ నేపథ్యంలో బలమైన సామాజిక సందేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. న్యూ ఇయర్ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో జాతర నేపథ్యంలో హీరో అఖిల్ ఉత్సాహభరితంగా కనిపిస్తున్నారు.
విశ్వక్సేన్ అంటే యువతరంలో ఓ స్పెషల్ క్రేజ్. ఆయన ఎంచుకునే కథలు కూడా యూత్‌ను మెప్పించేలా ఉంటాయి. ఇప్పటివరకు ప్రేమకథలు, యాక్షన్ ఎంటర్టైనర్స్తో మెప్పించిన ఆయన తాజాగా పంథా మార్చి ఓ పొలిటికల్ డ్రామాలో నటిస్తున్నారు. ‘లెగసీ’ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సాయికిరణ్ దైదా దర్శకత్వం వహిస్తున్నారు. కలాహీ మీడియా పతాకంపై యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ టీజర్‌ను విడుదల చేశారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అనివార్యంగా మోయవలసి వచ్చే సిద్ధార్థ్ అనే యువకుడి కథ ఇదని మేకర్స్ తెలిపారు. అవకాశరాజకీయాలు, రాజకీయపు ఎత్తుగడలను వివరిస్తూ విశ్వక్సేన్ వాయిస్ ఓవర్‌తో టీజర్ మెప్పించింది. ఇందులో విశ్వక్సేన్ దుఃఖంతో నలిగిపోతూ, మనసు విరిగిపోయిన కఠినమైన వ్యక్తి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తామని చిత్రబృందం పేర్కొంది. ఏక్తా రాథోడ్, రావు రమేష్, సచిన్ ఖేడేకర్, మురళీమోహన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోవింద్ వసంత, ఆర్ట్: రాజీవ్ నాయర్,
నటి సంయుక్త మీనన్ నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ‘ది బ్లాక్ గోల్డ్’. యోగేష్ కెఎంసి దర్శకుడు. రాజేష్ దండా నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ 75శాతం పూర్తయింది. ఈ ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక పోస్టర్ని విడుదల చేశారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఇంటెన్స్ లుక్‌తో రివాల్వర్ చేతబట్టుకొని ఉన్న సంయుక్త మీనన్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు. ఇంకా 15రోజుల షూట్ మాత్రమే మిగిలివున్నదని, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయని, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, ఊహించని మలుపులతో సరికొత్త కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుందని నిర్మాత రాజేష్ దండ తెలిపారు. మురళీశర్మ, రావురమేష్, నాజర్, రవీంద్ర విజయ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎ.వసంత్, సంగీతం: సామ్ సిఎస్, నిర్మాణం: హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్.
వీటితో పాటు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న న్యూఏజ్ ఫిల్మ్ ‘యుఫోరియా’, ‘కోర్ట్’ ఫేమ్ జోడీ హర్ష్ రోషన్, శ్రీదేవి నటిస్తున్న తెలంగాణ నేపథ్య ‘బ్యాండ్ మేళం’ చిత్రాలకు సంబంధించిన న్యూఇయర్ పోస్టర్స్‌ని కూడా గురువారం విడుదల చేశారు.