Udaypur Files | 2022లో రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో టైలర్ కన్హయ్య లాల్ పై జరిగిన పాశవిక హత్య దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనానికి కారణమైన విషయం తెలిసిందే. ఆ ఘటన ఆధారంగా దర్శకుడు భరత్ శ్రీనేట్ రూపొందించిన చిత్రం ‘ఉదయ్‌పూర్ ఫైల్స్’ . ఇప్పుడు ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అయితే విడుదలకు ముందే ఈ చిత్రం వివాదాస్పదంగా మారింది. ఈ సినిమాలో హింసను, ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నారని జమీయతే ఉల్మా-ఇ-హింద్ వంటి ముస్లీం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సినిమా విడుదలయితే శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటూ అధికారులను అలర్ట్ చేశాయి.
సమాజ్ వాద్ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మీ కూడా చిత్రంపై విమర్శలు చేశారు. “ఇది ఒక వర్గాన్ని టార్గెట్ చేయడానికి చేసే ప్రయత్నం” అంటూ అన్నారు. సినిమాను బ్యాన్ చేయాలన్న డిమాండ్లు, ఓటీటీలో కూడా విడుదల చేయవద్దన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సెన్సార్ బోర్డు చిత్రం పై దాదాపు 150 కట్స్ సూచించినట్టు సమాచారం. వివాదాస్పద సన్నివేశాల తొలగింపు అనంతరం సినిమాను సరికొత్త వెర్షన్లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లతో సినిమా మంచి హైప్‌ను సాధించినా… ఈ సెన్సార్ కట్స్ వల్ల ముఖ్య కథనం దెబ్బతినే అవకాశం ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో దర్శకుడు భరత్ శ్రీనేట్ స్పందిస్తూ.. “ఇది మతాన్ని లేదా వ్యక్తిగత విశ్వాసాన్ని ఉద్దేశించిన సినిమా కాదు. ఇది ఒక భావజాలం, ఒక సత్యం గురించి మాట్లాడే చిత్రం. ఎటువంటి ద్వేషాన్ని రెచ్చగొట్టే కంటెంట్ ఇందులో ఉండదు. ఈ సినిమా అందరూ చూడాల్సిన చిత్రమని భావిస్తున్నా” అని స్పష్టం చేశారు. దుగ్గల్, రజనీష్, ప్రీతి ఘుంగియాని, కమలేశ్, సావంత్, కంచి సింగ్, ముస్తాక్ ఖాన్ .. ఇతర కీలక పాత్రల్లో నటించారు. కన్హయ్య లాల్‌ను నరికి చంపిన సంఘటనకు దారితీసిన కారణాలు, పరిణామాలు, సాంకేతికంగా చిత్రీకరించబడగా, ఈ సినిమా ప్రేక్షకుల మద్దతు పొందుతుందా? లేదా వివాదాలతో ఆగిపోతుందా అనే దానికి సమాధానం కొద్ది గంటల్లోనే తెలుస్తుంది.